TRINETHRAM NEWS

ఎన్నికల కోడ్ వేళ బండి నోట సమ్మె మాట హాస్యాస్పదం

ఏపీ ఎన్జీఓ కంటే అంగన్వాడీ సంఘాలే బెటర్

రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయినందున అవసరం అయితే సమ్మె చేస్తాం అంటూ ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎస్సీ ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ తెలిపారు. నెల్లూరు లో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు ఎలా చేయాలో, ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుందో అంగన్వాడీ సంఘాలను చూసి ఎన్జీఓ నేతలు తెలుసుకోవాలని సురేష్ బాబు సూచించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం విఫలం అయిందన్న విషయం ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేవరకు ఏపీఎన్జీవో నేతలకు తెలియలేదా అని ప్రశ్నించారు.పిఆర్సీ విషయంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత ఏపీ ఎన్జీవో నేతలకే దక్కుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎన్నికల కోడ్ వచ్చే వేళ ప్రభుత్వంపై కాకుండా ఎన్నికల సంఘంపై ఉద్యమాలు చేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రభుత్వం చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువే చేసిందని ,గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత బాగా చేయలేదని ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన ఏపీ ఎన్జీవో నేతలు ఇప్పుడు ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఉద్యోగులను మరోసారి రెచ్చకొట్టే ప్రకటనలు చేయటం శోచనీయమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను తొలగించుకొనేలా క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల ఆకాంక్షలు, సమస్యలపై తమ నిఘా వ్యవస్థ(ఇంటిలిజెన్స్) ద్వారా సమాచారం సేకరించి తక్షణమే ప్రధాన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నేతలు మందా బాబ్జి,రావూరి రమణయ్య,కొమ్మల కృష్ణయ్య,విడవలూరు శ్రీకాంత్, కొల్లూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.