TRINETHRAM NEWS

Duddula Sridhar Babu, Minister of State for IT Industries, participated in the Badibata program

మంథని, జూన్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆసాంతం మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ ను మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక వసతుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు.

అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని అన్నారు.

పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉండాలని, దానికి అవసరమైన సంస్కరణలు తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అవసరమైన మౌళిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చే దిశగా కృషి చేశామని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కలెక్టర్ నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పనితీరును కలెక్టర్ రెగ్యులర్ గా సమీక్షించాలని మంత్రి సూచించారు. పిల్లల పై అధికంగా శ్రద్ద వహించే తల్లులకే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసిందని అన్నారు.

మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా చేతలు కూడా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగా ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌళిక వసతుల కల్పన అప్పగించామని అన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌళిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను పరిశీలించిన తర్వాత మన జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 984 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన కొనసాగిస్తున్నామని, అర్హత కలిగిన టీచర్ లందరికీ పదోన్నతులు కల్పిస్తామని అన్నారు.

పాఠశాలల్లో చదివే విద్యార్థులందరు మా పిల్లలే అని భావించి వారికి అవసరమైన క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి, బుధవారం స్పోర్ట్ యూనిఫాంతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని, ప్రస్తుతం మన సమావేశంలో ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పోలీస్ అధికారులు, తామంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, చిన్నారులందరిని గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ఉన్నత తరగతులకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామని అన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు.

30 కోట్ల నిధులతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టి, 99 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రంధాలయాల అభివృద్ధికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సూచించారు.

మార్కెట్ లో వచ్చే కొత్త కోర్సులు, ట్రెండ్స్ నైపుణ్యాలు విద్యార్థులకు అందించడం కోసం ఐటిఐ లను ఆధునీకరిస్తున్నామని అన్నారు. 65 అడ్వాన్స్ లెర్నింగ్ కేంద్రాలను దాదాపు 2234 కోట్ల రూపాయలు, టాటా కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కాటారం ఐటిఐ ఆధునీకరణ కోసం 6 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం ఉన్న విద్యార్థులంతా భవిష్యత్తులో నేను సెల్యూట్ చేసే స్థాయికి చేరుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి గా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా కోకో కోలా అనే బహుళ జాతి కంపెనీ తీసుకోని వస్తున్నామని అన్నారు. చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తీసుకోని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక చిన్న ఐటీ సంస్థ సైతం అతి త్వరలో మంథనిలో ఏర్పాటు కాబోతుందని, 50 మంది యువతకు నెల రోజుల లోపు ఉపాధి కల్గుతుందని అన్నారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ కాలనీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని, అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మన యువకులకు వచ్చేలా అవసరమైన నైపుణ్యం అందజేస్తామని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, విద్యార్థులు రెగ్యులర్ గా పాఠశాల తరగతి గదులకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం బడి బాట కార్యక్రమం ద్వారా చాలా మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుంచి మన ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యారని, వీరందరి విద్యా ప్రమాణాలపై శ్రద్ద తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాబోయే పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు 9.5 జీపీఏ కంటే ఎక్కువ గ్రేడ్ వచ్చే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత తరగతి విద్యార్థులకు ప్రస్తుత సంవత్సరం నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఫై ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు.

పాఠశాల ప్రారంభ సమయానికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఏక రూప దుస్తులు పంపిణీ సిద్దం చేశామని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లి తండ్రులతో అమ్మ ఆదర్శ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ద్వారా పాఠశాల నిర్వహణ , వసతుల కల్పన పనులు చేపట్టామని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ లు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా మని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌళిక వసతులనువినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మేర టాయిలెట్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా పనులు, మైనర్ మరమ్మత్తులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశామని అన్నారు.

10వ తరగతి విద్యార్థులపై గత సంవత్సరం పెట్టిన శ్రద్ధ కారణంగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టి పంపిణీ చేస్తున్నామని, విద్యార్థులకు పాఠ్యాంశాలు మెరుగైన విధానంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ అందించామని అన్నారు.

అనంతరం 10వ తరగతి ఫలితాలలో 10/10 జీపీఏ సాధించిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులను మంత్రి అభినందిస్తూ సన్మానించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, ఎంపీపీ కొండా శంకర్, జడ్పిటిసి టి.సుమలత, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పి.రమ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డి ఆర్ డి ఓ రవీందర్ రాథోడ్, మంథని మున్సిపల్ కమిషనర్ జి.మల్లికార్జున స్వామి, జెడ్పీ సీఈవో నరేందర్, తహసిల్దార్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ బీ.రజినీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Duddula Sridhar Babu, Minister of State for IT Industries, participated in the Badibata program