జూలై 26, 2026
TRINETHRAM NEWS
BJP is conspiring to delete votes

బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది

ఓటు చోరీ ప్రయత్నాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి

ప్రతి BLA పార్టీకి సైనికుడిలా పనిచేయాలి

ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగు

బీజేపీ కుట్రలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలి

వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ఓటర్ వెరిఫికేషన్ చేపట్టాలి

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం

SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి

ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై రాహుల్ గాంధీ నిరంతరం దేశాన్ని అప్రమత్తం చేస్తున్నారు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం మనందరి రాజ్యాంగబద్ధ బాధ్యత

ప్రతి బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటు హక్కు పరిరక్షణకు యోధులుగా పనిచేయాలి

రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలి

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

BJP : త్రినేత్రం న్యూస్ : హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి శాసనసభ్యులు కె.ఆర్. నాగరాజు గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా SIR (Special Intensive Revision) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… దేశంలో వరుసగా నాలుగోసారి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రజల తీర్పుతో గెలిచే పరిస్థితి లేకపోతే, ఓటర్ల జాబితాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే విషయాన్ని గుర్తించిన ఆ పార్టీ, ఏదో ఒక మార్గంలో రాజకీయ లబ్ధి పొందేందుకు ఓటర్ల జాబితాలనే ఆయుధంగా ఉపయోగిస్తోందని అన్నారు. అందుకే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి BLA అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. SIR ప్రక్రియ పేరుతో అనేక ప్రాంతాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఓటు వేశాం కదా అనే నిర్లక్ష్యం ప్రమాదకరమని, రేపు జాబితాలో పేరు లేకపోతే ప్రజాస్వామ్య హక్కే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఒక మహిళను పంపాలని నిర్ణయించిన సందర్భంలో మీనాక్షి నటరాజ్ గారిని చిన్న FIR పేరుతో అడ్డుకోవడం బీజేపీ మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీ, ఆచరణలో మాత్రం మహిళలకు అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. అంతేకాకుండా, బ్రెజిల్‌కు చెందిన వ్యక్తులను కూడా భారత ఓటర్లుగా చూపించే పరిస్థితులు ఏర్పడటం ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకు ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.

ఈ అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోసం కాకుండా, దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికేనని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఓటు హక్కు పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణేనని చెప్పారు. రాబోయే మూడు నెలల పాటు BLAలు, BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, అన్యాయంగా తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

“ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగు అని, బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును కాపాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలి” అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు.

అనంతరం డాక్టర్ కడియం కావ్య రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్” ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, టీపీసీసీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ నాగ సీతారాములు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహ్మద్ అయూబ్, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రియాంక అనిల్, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగళి వెంకటరాం నరసింహారెడ్డి, వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు దేవేందర్ రావు, మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వివిధ పీఏసీఎస్ చైర్మన్లు, మండల, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండల మహిళా అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page