
Big Shock for IPS Officer : త్రినేత్రం న్యూస్ : దసరా వేడుకల్లో ఆయుధ పూజ తర్వాత ఏకే-47తో కాల్పులు జరిపిన ఓ మహిళా ఐపీఎస్ అధికారికి చిక్కులు ఎదురయ్యాయి.
ఆమె కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విమర్శలకు దారితీయడంతో ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ స్పందించింది.ఆయుధాల వినియోగంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న అభ్యంతరాలతో రజ్‌నంద్‌గావ్ ఎస్పీ అంకితా శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 20న పోలీస్ లైన్స్‌లో సంప్రదాయ ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం అంకితా శర్మ ఏకే-47తో పలుమార్లు కాల్పులు జరిపారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె చర్యను సమర్థించగా.. మరికొందరు ఆయుధాల వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. వీడియోపై వచ్చిన ప్రతికూల స్పందన పోలీసు శాఖ గౌరవానికి భంగం కలిగించిందని పోలీస్ ప్రధాన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా నియమాలను ఎందుకు పాటించలేదో వివరణ ఇవ్వాలని అంకితా శర్మను ఆదేశించింది.
ఆమె సమాధానం అందిన తర్వాత తన అభిప్రాయాలను నమోదు చేసి పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపుతానని రజ్‌నంద్‌గావ్ రేంజ్ ఐజీ అజయ్ యాదవ్ తెలిపారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మరోవైపు..రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.కే. విజ్ మాట్లాడుతూ ఆయుధ పూజలో భాగంగా కాల్పులు జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.ఇలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.అలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధ పూజ సందర్భంగా ఖాళీ తూటాలతో కాల్పులు జరపడం సంప్రదాయంలో భాగమని ఓ ఐపీఎస్ అధికారి పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. అయితే,గాల్లోకి కాల్చిన తూటాలు తిరిగి కిందపడినప్పుడు సమీపంలోని వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
మాజీ సైనికాధికారి కేజే ధిల్లాన్ కూడా వీడియోలో కనిపించిన ఆయుధ వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆయుధాన్ని వివిధ దిశల్లో గురిపెట్టడం,వెనుక ప్రజలు ఉండటం వంటి అంశాలు ప్రమాదకరమని పేర్కొన్నారు.అయితే,కొందరు సోషల్ మీడియా వినియోగదారులు అంకితా శర్మకు మద్దతుగా నిలిచారు.ఆయుధ వినియోగంలో లోపాలు ఉంటే సరిదిద్దాలని,వాటి ఆధారంగా ఆమె వృత్తిపరమైన సేవలను తక్కువ చేసి చూడకూడదని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా,అంకితా శర్మతో పాటు అదనపు ఎస్పీ కీర్తన్ రాథోడ్ కూడా ఏకే-47తో కాల్పులు జరిపినట్లు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. రాయ్‌పూర్,బిలాస్‌పూర్,రాయ్‌గఢ్, దుర్గ్,కబీర్‌ధామ్,బస్తర్ జిల్లాల్లోనూ ఆయుధ పూజ అనంతరం పోలీసులు కాల్పులు జరిపిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో ఉత్సవాల సమయంలో ఆయుధాల వినియోగం,భద్రతా ప్రమాణాల అమలుపై చర్చ మొదలైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe