Trinethram News : పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ నిరుపేద మహిళపై కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. పని ఇప్పిస్తామని నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడి చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ మండలం జానకంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందినవారు. ఆమె భర్త మెదక్ పట్టణంలో అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు కలిసి కూలీ పనులు చేస్తూ ఉంటారు. అయితే తన భర్త గద్వాల్ లో రెండు రోజుల పాటు పని ఉంది అని వెళ్ళడంతో ఆ మహిళ ఒక్కతే క్యారేజ్ పెట్టుకుని శుక్రవారం ఉదయం కూలి పని కోసం మెదక్ పట్టణానికి వచ్చింది. అక్కడి కూలీల అడ్డాలో పని కోసం ఎదురుచూస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను సంప్రదించారు. పని ఉందని నమ్మబలికి, ఆమెను కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులోని ఏడుపాయల వెళ్లే రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వివస్త్రను చేసి, రెండు చేతులను ఓ స్తంభానికి కట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. రాత్రంతా బాధతో అలమటించిన ఆ మహిళను శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, బాధితురాలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


