TRINETHRAM NEWS

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం ఏపీలో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్రవడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వీటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 93 మండల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో శ్రీకాకుళంలో 6 , విజయనగరంలో 20, పార్వతీపురంమన్యంలో 8, అల్లూరిసీతారామరాజులో 8, అనకాపల్లిలో 11, కాకినాడలో 6, కోనసీమ4, ఏలూరు4, ఎన్టీఆర్ 2, గుంటూరు7, పల్నాడు2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

కాగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేట, సింహాద్రిపురంలో 45.6°C, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5°C, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4°C, పల్నాడు జిల్లా విజయపురి లో 45.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 107 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయని అధికారులు పేర్కొన్నారు.

తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.