Celebration of Literacy : అక్షర ఉత్సవం.. ‘బడిబాట’ నినాదం

TRINETHRAM NEWS
Celebration of Literacy

Celebration of Literacy : డిండి( గుండ్లపల్లి )మార్చి 30:త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా, విద్యా కుసుమాలు వికసించాలనే సంకల్పంతో డిండి(గుండ్లపల్లి) మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో ‘బడిబాట’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం స్థానిక జెడ్పీ హెచ్ ఎస్ మరియు ఎం పి పి ఎస్ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ పుర వీధుల్లో ఒక పండుగ వాతావరణాన్ని తలపించినట్లు అనిపించింది

ప్రజాప్రతినిధుల చొరవ.. విద్యావేత్తల అడుగుజాడలు:–

గ్రామ సర్పంచ్ మీసాల రామచంద్రయ్య, గెజిటెడ్ హెచ్‌ఎం ఇస్లావత్ గోప్య నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు. ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు బడిబాట నిర్వహిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి అవగాహన:—

కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఉపాధ్యాయ బృందం మరియు ప్రజాప్రతినిధులు కలిసి ఎండను సైతం లెక్కచేయకుండా గ్రామంలోని ప్రతి ఇంటినీ సందర్శించారు. ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. బడి మానేసిన పిల్లల ( డ్రాప్ అవుట్స్)వివరాలను సేకరించి, వారిని తిరిగి విద్యాభ్యాసంలో భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రభుత్వ రాయితీలు – విద్యార్థులకు వరం:–

గెజిటెడ్ హెచ్‌ఎం గోప్య నాయక్ మరియు ఎంపీపీఎస్ హెచ్‌ఎం ముడి శ్రీనయ్య విద్యార్థులకు అందే ప్రయోజనాలను గురించి వివరించారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫాంలు, షూస్, సాక్స్ మరియు బ్యాగుల పంపిణీ ఉంటుందని తెలిపారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు, విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ప్రవేశపెట్టిన ‘రాగిజావ’ విశిష్టతను వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులో ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు.

యువతకు పిలుపు.. విద్యా పరిరక్షణే లక్ష్యం:–

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ చిట్టెమ్మ, విద్యావేత్త జంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మనుగడ గ్రామ అభివృద్ధికి చిహ్నమని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వార్డు సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం గ్రామంలో విద్యా చైతన్యాన్ని నింపింది. “బడిబాట” కేవలం ఒక కార్యక్రమం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని చాటిచెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top