
Vijayasai Reddy Organic Farming : త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన తోటలోని మిరప చెట్లకు చీడపీడల నుండి రక్షణ కల్పించేందుకు ‘అగ్నాస్త్రం’ అనే ప్రకృతి సిద్ధమైన కషాయాన్ని స్వయంగా స్ప్రే చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ అగ్నాస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని కూడా ఆయన వివరించారు. గోమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకును ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి బాగా కలిపి, మరగబెట్టిన తర్వాత 24 గంటల పాటు నిల్వ ఉంచి, ఆపై వడపోసి చెట్లకు వినియోగిస్తారని తెలిపారు. ఇది రసాయన మందుల కంటే శక్తివంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

