Trinethram News : నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి మృణాల్ కుమార్ ఫిర్యాదు మేరకు, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్‌బి నగర్, పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రముఖ బీమా సంస్థల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఈ సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందంతో ఈ నెల 27వ తేదీన ఎన్ఎల్‌బి నగర్‌లో దాడులు నిర్వహించి రఘుల రవి, శివ కుమార్, ఎస్. కుర్తి మాణిక్యరావు, కొత్త బాబు రావు, రఘుల మహేష్, తదాకల గిరిధర్ గౌడ్, మోర నరసింహ, కుందుంగారి నాగరాజు, జెర్పుల కిషన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి భారీగా నకిలీ వాహన బీమా పత్రాలు, స్టాంపులు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యవసరంగా బీమా రెన్యువల్ అవసరమైన వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ఈ ముఠా తో సంబంధం అన్న ఇతరులను కూడా విచారించి అరెస్ట్ చేస్తామన్నారు. ఈ నకిలీ పాలసీల వల్ల ప్రజలు మోసపోవడమే కాకుండా ప్రమాదాల సమయంలో చట్టపరమైన, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. వాహన బీమా తీసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్లు లేదా కంపెనీ ఏజెంట్ల ద్వారా ధృవీకరణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


