Trinethram News : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ) ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వీటిని నిర్వహించేందుకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో 12,702 గ్రామాలకు నూతనంగా సర్పంచులు ఎన్నికయ్యారు. ఇందులో 85% మంది కొత్తవారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో, నిధుల పంపిణీ నిబంధనల్లో మార్పులు వచ్చిన నేపథ్యంలో సర్పంచులందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ కోసం 253 మంది మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఇప్పటికే ట్రైనర్లకు పునశ్చరణ తరగతులను నిర్వహించారు.
సర్పంచులకు వారి అధికారాలు, విధులు, పాలన, ఆర్థిక నిర్వహణ, నిధులు, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై వీరు అవగాహన కల్పించనున్నారు. శిక్షణ కోసం ఒక్కో బృందంలో 50 మంది చొప్పున ప్రతి జిల్లాలోని సర్పంచులను ఐదు బృందాలుగా విభజించనున్నారు.
అనంతరం 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తారు. వారికి బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.5,000 వరకు వెచ్చిస్తారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ తరగతులు సర్పంచులకు ఎంతగానో ఉపయోగపడతాయని, పారదర్శకమైన పాలన, నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా సత్వర స్పందనకు దోహదపడతాయని, గ్రామ స్వరాజ్యానికి దృఢమైన పునాది వేస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


