చరిత్రలో సగం పేజీలు ఆమెకే…
-పాల్గొన్న సిబ్బంది మరియు జర్నలిజం విద్యార్థులు.
కూకట్పల్లి ప్రతినిధి జనవరి 03 (త్రినేత్రం న్యూస్) : సమాజంలో సగభాగం స్త్రీలే అయితే… స్త్రీ జనోర్ధరణకు, మహిళా విద్యా వికాసానికి తోడ్పడిన సావిత్రిబాయి పూలే సాధించిన మహిళాభ్యుదయ ఫలాలు ఆధునికభారత దేశచరిత్ర పుటల్లో నిలిచి పోవడానికి కారణం ఈ దేశ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి.మహారాష్ట్ర సతారా జిల్లాలో నాయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి పూలే ఒక రైతు కుటుంబంలో జన్మించారు.
మాలి సమాజంలో పుట్టి పెరిగిన ఆమె తన 9వ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. సావిత్రిబాయి చిన్న వయసులోనే జ్యోతిరావు ఫూలేను వివాహం చేసుకుంది .సావిత్రిబాయి వివాహం సమయంలో నిరక్షరాస్యురాలు.. ఆమె భర్త ఇంట్లో చదువు ద్వారా మరియు తరువాత పూణే మరియు అహ్మద్‌నగర్‌లలో ఉపాధ్యాయ శిక్షణ పొంది, భారతదేశంలో మొట్టమొదటి వృత్తిపరంగా శిక్షణ పొందిన మహిళా ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయురాలిగా మారింది.
1848లో, జ్యోతిరావు మరియు సగుణబాయి క్షీర్‌సాగర్‌లతో కలిసి, సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆమె పూణేలోని భిదేవాడలో గణితం, సైన్స్ మరియు సామాజిక అధ్యయనాల ప్రగతిశీల సిలబస్‌పై దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది. బాలికలకు విద్యను అందించడం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు దారి తీసింది. ఈ దేశ తొలి మహిళా టీచర్‌గా సావిత్రిబాయి నిలిచారు.
దేశ చరిత్రలోనే స్త్రీ విముక్తి ఉద్యమానికి ఓనమాలు దిద్దారు. స్త్రీ విద్యకు అనేక అవమానాలు, ఆటంకాలు స్పృష్టిస్తున్నప్పటికి, మరోవైపు ఆమె బాలికల పాఠశాలకు వెళ్తుంటే బురదతో, మట్టితో, పేడ నీళ్లు చల్లి సనాతన పిడివాదులు అవరోధాలు కల్పించారు. ఆమె ధరించిన వస్త్రాలతో పాటు అదనంగా మరో జత పాఠశాలకు తీసుకొని వెళ్ళేది. అవసరానికి ఆ జతను ఉపయోగించుకునేది. సంప్రదాయవాదులు చేసిన ఎన్నో ఒత్తిడిలకు, అవమానాలకు గురి అయిన ఆమె ఆత్మస్థైర్యం మనోనిబ్బరం చెక్కుచెదరలేదు.
సమాజం, కుటుంబం బహిష్కరణ నడుమ ఎలాంటి రాజీ లేకుండా సావిత్రిబాయి ఒక మహోన్నతమైన విద్యా ఉద్యమాన్ని సాహసోపేతంగా నడిపింది.మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించింది సావిత్రిబాయి పూలే. స్త్రీలను చైతన్య పరచడానికి ‘మహిళా సేవా మండల్’ అనే మహిళా సంఘాన్ని ఆమె స్థాపించారు.
సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలకు, మద్యపానానికి, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి, వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి ఆశ్రయం కల్పించి వారి కళ్లలో వెలుగులు చూశారు. సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం ఏర్పాటు చేసి స్త్రీలను చైతన్యపరచడమే కాక వారి హక్కులకోసం ఉద్యమ బాట చైతన్యాన్ని రగిల్చింది.
శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని సావిత్రిబాయి ప్రారంభించింది. 1854లోనే ఆమె తమ కవితా సంపుటి ‘కావ్య ఫూలే’ను ప్రచురించారు. కవితా సంపుటి ‘పావన కాశీ శుభోద్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. జ్యోతి రావు ఫూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ దుఃఖం లో నుండి మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు.
తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. మన దేశంలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన అది. సనాతన వాదులు, అభివృద్ది నిరోధకులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికి ఆమె వెనక్కి తగ్గలేదు. సావిత్రిబాయి మరియు జ్యోతిరావులకు సొంత పిల్లలు లేరు. వారు ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడు అయిన యశ్వంత్‌ను దత్తత తీసుకున్నారని చెబుతారు.1897లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారిప్రాణాలను కాపాడుకోవడానికి జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు.
సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులానికి చెందిన చిన్న పిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. అయితే ఆ ప్లేగు వ్యాధి ఆమెకూ సోకింది. 1897 మార్చి 10న సావిత్రిబాయి తుదిశ్వాస విడిచారు. స్త్రీ విద్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని భారత స్త్రీ జాతి భూమ్యాకాశాలు ఉన్నంతవరకు నిరంతరం గుర్తు చేసుకుంటుంది. స్త్రీలూ మనుషులేనని వారి హక్కులే మానవ హక్కులని దేశానికి చాటిచెప్పిన ధీరవనిత.
అంటరానితనాన్ని, కుల వ్యవస్థను ఆమె ఎదిరించిన తీరు భారతీయ మహిళా ఉద్యమాలకు ఆదర్శనీయం. భారతీయ స్త్రీ వాదం, దళిత స్త్రీ వాదాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించిన నాయకురాలు సావిత్రిబాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి. ఆమె 174 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఉద్యమ లక్ష్యాలు నేటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.
మహిళలు,సమాజంలోని సమస్త వర్గాలు, లింగ, కుల, మత రహిత సమాజ శ్రేయస్సు, సంక్షేమం, సమానత్వం కోసం పని చేసిన వీర నారి సావిత్రి బాయి. ఆమె ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత ముఖ్యంగా నేటి యువ భారతీయుల భుజస్కంధాలపై ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


