Distribution of Land Titles : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లబ్ధిదారులకు భూపట్టాల పంపిణీ

TRINETHRAM NEWS

అనంతగిరి,జనవరి 3, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగడ్డ పంచాయతీలో భూ పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. గ్రామీణ ప్రజల దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి హాజరై లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరాలుగా భూములపై హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఈ భూ పట్టాల పంపిణీ ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. ఇది గ్రామీణాభివృద్ధికి కీలకమైన ముందడుగని తెలిపారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్బారావు, బీజేపీ పార్టీ అధ్యక్షులు సోమరాజు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర పాల్గొని కూటమి ప్రభుత్వానికి అభినందించారు. మండల తహసిల్దార్ వీరభద్ర చారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడగా, మండల డిప్యూటీ తహసిల్దార్ మాణిక్యం అధ్యక్షత వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఒరాకఒడ్డు గ్రామానికి చెందిన 21 మంది రైతులకు, కత్తురు గ్రామానికి చెందిన 26 మంది రైతులకు భూ పట్టాలను పంపిణీ చేశారు. భూ పట్టాల ద్వారా లబ్ధిదారులకు చట్టబద్ధమైన భూ హక్కులతో పాటు ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని నాయకులు తెలిపారు. సొంత భూమి ఉండటం వల్ల గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వ్యవసాయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
భూ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమకు భద్రతతో కూడిన జీవనం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అప్పారావు, ఉప సర్పంచ్ కొండమ్మ, జనసేన పంచాయతీ నాయకులు సన్యాసిరావు, రాము, చంటి, విలేజ్ రెవెన్యూ అధికారి చిట్టిబాబు, జగయమ్మ, గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా, సవ్యంగా ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of land titles to beneficiaries

You cannot copy content of this page

Scroll to Top