TRINETHRAM NEWS

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్

Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం జగన్‌.. ఈ కామెంట్స్ చేశారు. గతంలో తన బాబాయ్‌ను మంత్రిని చేసి కాంగ్రెస్ తమపై ప్రయోగించిందని చెప్పారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్ మరోసారి సోదరని తన పైకి ప్రయోగించిందని పేర్కొన్నారు. దేవుడు వారికి గుణపాఠం చెబుతారన్నారు జగన్. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కూటమితోనే తమకి పోటీ అన్నారు. ప్రజలు తమవైపే ఉన్నట్లు భావిస్తున్నామన్నారు జగన్. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదని.. సీఐడీ దుర్వినియోగ ఆరోపణలు అర్థరహితమన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు స్పష్టం చేశారు

ఇక ఏపీలో విద్యా సంస్కరణలపై సీఎం జగన్ కీలక కామెంట్స్ చేశారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది తన బలమైన నమ్మకమన్నారు. నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలని చెప్పారు. గతంలో పేదలకు తెలుగు మీడియంలో బోధన జరిగేది, ధనిక పిల్లలు ఇంగ్లీషులో చదివేవారని.. ఆ పరిస్థితి తాము పూర్తిగా మార్చివేసి.. పేదలకు సైతం ఆంగ్ల విద్యను చేరువ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధించేలా చేయరాదని విమర్శించే వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? అని సీఎం ప్రశ్నించారు. పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా.. పాఠ్యపుస్తకాల్లో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్‌ పెట్టినట్లు తెలిపారు. నాడు-నేడు తీసుకొచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామన్నారు. 62వేల తరగతి గదులుంటే .. 40 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ టీవీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

8వ తరగతి విద్యార్థులందరికీ ఒక ఆధునికమైన టాబ్‌ నేర్చుకునేందుకు అందించినట్లు సీఎం తెలిపారు. బోధనకు అదనంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బైజూస్‌ అంశాలను చేర్చినట్లు వివరించారు. ఐదేళ్ల తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్యులరేట్‌ సర్టిఫెకెట్‌ కోసం పోటీ పడతారన్నారు జగన్. IB, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ.. చిన్న నుంచి పెద్ద తరగతుల వారికి IB బోధన ఇస్తున్నామన్నారు.