MLC Thota Trimurthulu : మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: మద్యం పరిశ్రమలు, నకిలీ మద్యం, బెల్ట్ షాపుల ద్వారా జనావాసాల్లో మద్యం ఏరులై పారుతుండటంపై రాష్ట్ర సవాడినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం పాలసీపై గత 18 నెలల్లో ఏమీ చేయలేదని, మద్యం షాపులు ఎమ్మెల్యేల పర్యవేక్షణలోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

“మద్యం ఏరులై పారుతుంటే మీకు కనిపించకపోతే మేమేం చేయగలం? మున్సిపాలిటీ దగ్గర కూర్చుంటే మద్యం ఎలా పారుతోందో అవగతమవుతుంది,” అని తోట విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పినా, ఒక్క షాపునూ మూసివేయలేదని, ఊరికి నాలుగైదు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. “ప్రతి బ్రాందీ షాపు నుండి పావలా పైసల వాటా తీసుకుంటూ ఎమ్మెల్యేలు, భాగస్వాములుగా ఉన్నారు. అందుకే బెల్ట్ షాపులను జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు,” అని ఆయన ధ్వజమెత్తారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం షాపులు ఊరి చివర నిబంధనల ప్రకారం ఉండేవని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం పరిశ్రమలను చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏర్పాటు చేసి, ఆఫ్రికా కంపెనీల ద్వారా నకిలీ మద్యం తయారు చేయించి ఆంధ్రప్రదేశ్‌ను ‘మద్యాంధ్ర’గా మార్చిందని తోట ఆరోపించారు. “ఈ నీచ రాజకీయాలను మాజీ మంత్రి జోగి రమేష్‌పై నెట్టడం సిగ్గుచేటు,” అని ఆయన అన్నారు.

అలాగే, మండపేట మండలంతో పాటు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని 18 నుండి 20 రూపాయలకు కొనుగోలు చేసి, ఎంచుకున్న రైస్ మిల్లర్ల ద్వారా కిలో 40 రూపాయలకు విదేశాలకు అమ్ముతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. “ప్రజల ఆస్తిని దోచుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం,” అని ఆయన విమర్శించారు.

రేషన్ షాపులపై అధికారులను పంపించి తనిఖీల పేరుతో డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆదేశాలతో రేషన్ డీలర్లను రప్పించి కండువాలు వేయిస్తున్నారని తోట ఆరోపించారు. “మూడు మండలాల్లో రేషన్ షాపులపై కావాలనే కేసులు పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్లను ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు,” అని ఆయన గుర్తు చేశారు. వెంటూరులో వైస్ సర్పంచ్‌గా పనిచేస్తున్న రేషన్ డీలర్‌ను భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, చేరగానే ఆ షాపుపై కేసులు ఎలా అదృశ్యమయ్యాయని తోట ప్రశ్నించారు.

అధికార దుర్వినియోగం సమంజసం కాదని, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని గుర్తు చేస్తూ, చిన్న విషయాలకు అధికార పార్టీ ప్రోత్సాహంతో అధికారులు అత్యుత్సాహం చూపడం సరైనది కాదని తోట అన్నారు.

వైసీపీ హయాంలో బస్టాండ్‌లో రిక్షా కార్మికుల కోసం సుమారు 10 లక్షల రూపాయలతో షెల్టర్ ఏర్పాటు చేయగా, రిక్షా స్టాండ్ ను, రిక్షా స్టాండ్ బోర్డును తొలగించిన విషయం తెలియదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమని తోట విమర్శించారు. “మీ ప్రమేయం లేకుండా అధికారులు షెడ్డును శుభ్రం చేసి మెప్మా బజార్ ఏర్పాటు చేశారా? ఇది మీ దృష్టిలో లేకుండా జరిగిందా?” అని ఎమ్మెల్యే జోగేశ్వరరావును తోట ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, జడ్పిటిసి కుడిపూడి రాంబాబు, కౌన్సిలర్స్ మందపల్లి రవి కుమార్, మెండి బాపిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, పిల్లా వీరబాబు, ఐటీ వింగ్ కన్వీనర్ యారామటి వెంకన్న బాబు, బూత్ కమిటీ కన్వీనర్ పోతుల ప్రసాద్, యాదగాని రామకృష్ణ, గణేష్, మేడిశెట్టి గోవిందు, కోళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government's dirty politics on liquor policy

You cannot copy content of this page

Scroll to Top