ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
42వ డివిజన్లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. స్థానిక 42వ డివిజన్ ఎల్ బి శాస్త్రి మార్గంలో రూ. 35 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నగరాభివృద్ధే ధ్యేయంగా తాము పని చేస్తున్నామన్నారు. రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జెఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేక పోయినా డివైడర్లు, ఫుట్ పాత్ లు నిర్మించారని మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో తాము మార్పు చేసి చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ళ కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయన్నారు. నగరంలోని 35 పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా గ్రీన్ రాజమండ్రి – ఆరోగ్య రాజమండ్రిని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కుల అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజమండ్రి చరిత్ర భవిష్యత్తులో నిలిచిపోయేలా కూటమి అభివృద్ధి పనులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాశి నవీన్ కుమార్, డివిజన్ ఇంచార్జ్ మళ్ల వెంకట రాజు, కెవి శ్రీనివాస్, సావిత్రి, వానపల్లి శ్రీనివాస్, కొండబాబు, మహబూబ్ ఖాన్, సలాది ఆనంద్, జవ్వాది మురళి, పాలవలస భద్రం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


