TRINETHRAM NEWS

Trinethram News : అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగకి వరస సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మార్మోగాయి..

సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో మేడారంలోని సమ్మక్క, సారలమ్మ (Telangana Tribal Festival) వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతరకు నెలరోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జరిగే మేడారం జాతర జరుగుతుంది. దీంతో భక్తులు ముందుగానే సెలవు దినాలు చూసుకొని అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మహాజాతర దగ్గరపడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యాభై వేలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దెల వద్ద రద్దీ నెలకొనడంతో దర్శనం కాస్త ఆలస్యమైంది. మహా జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందస్తుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద భక్తుల స్నానాలకోసం ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులు కోరుతున్నారు.

” సంక్రాంతి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వచ్చాం. సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి దర్శించుకున్నాం. గద్దెల వద్ద చాలా రద్దీ ఉండటంతో దర్శనానికి చాలా సమయం పడుతోంది. జంపన్న వాగులో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత జాతరకు రావడం చాలా సంతోషంగా ఉంది.” – భక్తులు..

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. దీనిని తెలంగాణ కుంభమేళ అని కూడా అంటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు అయిన సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.

సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే..?మేడారం జాతర తొలి రోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవింద రాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తల్లులు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్దలతో అమ్మలను దర్శించుకుంటారు