Trinethram News : 7th Jan 2024
“Ration Card e-KYC : రాష్ట్ర ప్రజలకు అలర్ట్. రేషన్ కార్డు ఈ-కేవైసీకి టైమ్ దగ్గర పడుతుంది. మీరూ పూర్తి చేశారా? లేదా? అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి. ఇంతకీ లాస్ట్ డేట్ ఎప్పుడు? ఒకవేళ పూర్తి చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
“Ration Card e-KYC Update : ఆధార్ ఎంత పవర్ ఫుల్ ధ్రువపత్రమో.. రేషన్ కార్డు కూడా అంతే పవర్ ఫుల్. దీంతో వచ్చే సరుకులు ఇంకా అదనం. అందుకే.. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కావాలని కోరుకుంటారు. ఇంట్లోని పిల్లలకు పెళ్లి కాగానే. వారు సొంత కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ దారిద్రరేఖను కేంద్రంగా చేసుకునే ప్రవేశపెడుతుంటాయి. కాబట్టి.. వాటి ఫలాలు అందుకోవాలన్నా.. లబ్ధిదారులుగా ఉండాలన్నా రేషన్ కార్డు(Ration Card) అనివార్యం. ఇలాంటి రేషన్ కార్డుకోసం తెలంగాణలో జాతరే కొనసాగుతోంది.
“ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మహాలక్ష్మి, గృహజ్యోతి తర్వాత రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయట. లక్షలాదిగా జనం రేషన్ కార్డుకోసం అప్లై చేసుకున్నారు. అయితే.. కొత్త రేషన్ కార్డుదారుల సంగతిని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అర్హత ఉన్నవారికి కార్డులు మంజూరు చేస్తుంది. కానీ.. పాత రేషన్ కార్డుదారులకే ఇంకా కేవైసీ పని మిగిలి ఉంది.
“ఇంకా లక్షలాదిగా పెండింగ్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డుదారులు కేవైసీ నమోదు చేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే.. ఇప్పటికీ 60 శాతం మాత్రమే కేవైసీ పూర్తయినట్టు సమాచారం. ఇంకా గడువు ఉంది కదా అని కొందరు లైట్ తీసుకుంటుండగా.. ఆధార్ అప్డేట్ సమస్యలతో చాలా మంది కేవైసీ పూర్తి చేయలేకపోతున్నారు.
“కేంద్రాల వద్ద రద్దీ.. రేషన్ కేంద్రాల్లో చాలా మంది కేవైసీ పూర్తికావట్లేదు. దీనికి ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడమే కారణమని డీలర్లు చెబుతున్నారు. దీంతో.. జనాలు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయితే.. ఆధార్ సెంటర్స్ తగినన్ని లేకపోవడంతో.. ఉన్న కొద్దిపాటి కేంద్రాల ముందు జనాలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇటు రేషన్ కేంద్రాల చుట్టూ.. అటు ఆధార్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు.
“లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది.. రేషన్ కేవైసీకి ఆఖరి డేట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 31వ తేదీలోగా లబ్ధిదారులు అందరూ కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటు చూస్తే ఆధార్ అప్డేట్ కాక జనాలు అవస్థలు పడుతున్నారు. అటు చూస్తే గడువు దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
“కేవైసీ కాకపోతే ఏం జరుగుతుంది?
“తెలంగాణలో 2014 డేటా ప్రకారం రేషన్ అందిస్తున్నారు. కానీ.. గడిచిన పదేళ్లలో చాలా మంది చనిపోయారు. అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు. అబ్బాయిలు కూడా కొత్త కాపురాలు పెట్టారు. ఇన్ని మార్పులు జరిగినప్పటికీ.. రేషన్ పంపిణీ యథావిధిగా జరుగుతోంది. దీంతో.. అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు కేవైసీ చేయిస్తోంది. అయితే.. ఒకవేళ కేవైసీ చేయకపోతే రేషన్ కార్డులో పేరు తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మళ్లీ తిరిగి పేరు చేర్చడం అన్నది అసాధ్యం కాకపోయినా.. అదో పెద్ద ప్రయాస అని మాత్రం చెప్పుకోవచ్చు. దీనికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. ఈ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అప్పటి వరకూ రేషన్ జాబితాలో పేరు ఉండదు. రేషన్ బియ్యం రాకపోవడమే కాకుండా.. ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి.. గడువులోగా కేవైసీ పూర్తి చేయించుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.