TRINETHRAM NEWS

Trinethram News :

ఏకాదశీ వ్రత మహిమ

సఫల ఏకాదశి

రేపు జనవరి 07 ఆదివారం సఫల ఏకాదశి సందర్భంగా…

సఫల ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యం శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణము నందు వర్ణించబడింది.

“కృష్ణా! మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని ఏ విధంగా పాటించాలి. దయచేసి దీనిని నాకు వివరంగా చెప్పవలసినది” అని ధర్మరాజు అడిగాడు.

ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: “భరతవంశశ్రేష్ఠుడా! సర్పములలో శేషుడు ఉత్తముడైనట్లు, పక్షులలో గరుడుడు శ్రేష్ఠుడు అయినట్లు, యజ్ఞములలో అశ్వమేధయజ్ఞం శ్రేష్ఠమైనట్లు, నదులలో గంగానది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠమైనట్లు, వ్రతములలో కెల్ల ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది. రాజోత్తమా! ఏకాదశి వ్రతపాలనం చేసేవాడు నాకు ఎంతో ప్రియమైనవాడు, ఐదువేలసంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశివ్రతపాలన వలన సిద్ధిస్తుంది.”

మహిష్మతుడనే సుప్రసిద్ధుడైన రాజు చంపవతిపురాన్ని పాలించేవాడు. ఆ రాజుకు నలుగురు పుత్రులు. వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమపాపి. బ్రాహ్మణులను, వైష్ణవులను, దేవతలను సదా నిందించే స్వభావం కల్గిన లుంపకుడు జూదం, వ్యభిచారం పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అందువలన రాజు అతనిని దేశబహిష్కరణ జేశాడు. అప్పుడు లుంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రివేళలలో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు. ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినప్పటికిని రాజు కుమారుడని భావించి జనులు అతనిని విడిచి పెట్టేవారు. లుంపకుడు పచ్చిమాంసం తింటూ జీవనాన్ని గడపసాగాడు.

అతడు ఉన్నట్టి అడవిలో ఒక అశ్వత్థవృక్షం ఉన్నది. అది దేవతల వలె పూజనీయమైనది. లుంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలం జీవించాడు. అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిరకృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట, దుర్బలత కారణంగా అతడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పినవాడై ఏకాదశిరోజు మధ్యాహ్నవేళకు తిరిగి స్పృహను పొందాడు. ఆకలిపీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు. అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకుసమర్పించాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేశాడు.

ఉపవాసం, జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలనం చేసినట్లు అయింది. సాధకుడు చేసే ఈ వ్రతపాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరిస్తాడు. ఈ ఏకాదశీవ్రతపాలనఫలంగా లుంపకునికి ఐశ్వర్యయుత మైన రాజ్యం సంప్రాప్తించింది. మర్నాడు ప్రొద్దున ఒక దివ్యమైన అశ్వం అతని ముందు నిలబడింది. ఆ సమయంలో ఒక అశరీరవాణి “రాకుమారా! మధుసూదనుని కృప వలన, సఫల ఏకాదశీ ప్రభావం వలన నీకిపుడు రాజ్యం లభిస్తుంది. నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండ పాలించ గలుగుతావు. కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు” అని పలికింది. ఆ ఆదేశం ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యభారాన్ని స్వీకరించాడు. తదనంతరం అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. ఈ ప్రకారం అతడు ఆనందంగా రాజ్యపాలనం చేసాడు.

సఫల ఏకాదశి పాటించడం ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి, తదుపరి జన్మలో ముక్తిని పొందుతాడు. ఈ ఏకాదశి చేసేవారు ధన్యులు. ఈ ఏకాదశి పాటించడం వలన అశ్వమేధ యజ్ఞఫలం లభిస్తుంది.