TRINETHRAM NEWS

మాల్కాపూర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*కుక్కల సంతానం వృద్ధి చెందకుండా ఆపరేషన్లు

పెద్దపల్లి, అక్టోబర్-22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మల్కాపూర్ దగ్గర యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కోయ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్, 2023 ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మల్కాపూర్ యందు యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను హైదరాబాద్ కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ కేంద్రంలో ఒక ఆపరేషన్ ధియేటర్, 50 కుక్కలను ఉంచడానికి అవసరమైన బోన్లు ఏర్పాటు చేశామని, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనం-స్వచ్ఛదనం కార్యక్రమం క్రింద గుర్తించిన కుక్కలను, వాటి సంతానం వృద్ధి చెందకుండా ఏరియా వారీగా పట్టుకొని, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్, 2023 ప్రకారం కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వారం రోజుల పాటు బర్త్ కంట్రోల్ సెంటర్ యందే ఉంచి, తరువాత కుక్కలను పట్టిన ప్రాంతాలలో తిరిగి విడిచిపెట్టడం జరుగుతుందని తెలిపారు.

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన దాదాపు 3500-4000 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తి అయ్యేవరకు ఈ కార్యక్రమం సుమారు 3 నుండి 4 నెలల వరకు నిర్వహించడం జరుగుతుందని,కేవలం రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోనే కాకుండా, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కూడా కుక్కలను తీసుకువచ్చి వాటికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వారం తరువాత కుక్కలను పట్టిన ప్రాంతాలలో తిరిగి విడిచిపెట్టడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App