AP CM YS Jagan : విద్యా దీవెన కింద రూ. 584 కోట్లు జమ..బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన సీఎం
_ చదువు అన్నది తల రాతలు మార్చే ఒక ఆస్తి :సీఎం జగన్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఖుష్ కబర్ చెప్పారు. ఈ మేరకు తాడేపల్లి గూడెం లోని తన క్యాంపు ఆఫీసులో బటన్ నొక్కి రాష్ట్రంలోని 8.09 లక్షల మంది విద్యార్థులకు రూ. 584 కోట్లు ఆర్థిక సాయం కింద ఖాతాల్లో జమ చేశారు.
5 ఏళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు రూ. 18,476 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు ఏపీ సీఎం. రాష్ట్రంలో తాము కొలువు తీరిన తర్వాత దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు.
గతంలో కొలువు తీరిన టీడీపీ సర్కార్ విద్యార్థుల గురించి పట్టించు కోలేదని ఆరోపించారు జగన్ రెడ్డి. కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో విద్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పారు.
నాడు నేడు పథకం కింద ప్రభుత్వ ఆధీనంలోని బడులను కార్పొరేట్ సంస్థల స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న నూతన మార్పులకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దేందుకు కృషి చేసినట్లు స్పష్టం చేశారు.