TRINETHRAM NEWS

లైంగిక వేధింపుల వివరాల్ని ఈడీ వెల్లడించాల్సిందే
దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ*

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను మినహాయించినప్పటికీ, లైంగిక వేధింపులు సహా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ దరఖాస్తుదారులు కోరినప్పుడు ఈడీ వెల్లడించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, డీఆర్డీవో లాంటి సంస్థలకు స.హ.చట్టం నుంచి మినహాయింపును ఇవ్వడానికి ఉద్దేశించిన సెక్షన్‌ 24 మానవ హక్కుల ఉల్లంఘన సంబంధ అంశాల్లో మాత్రం వర్తించదని ధర్మాసనం పేర్కొంది. ఇద్దరు ఆర్టీఐ దరఖాస్తుదారులకు నిర్దిష్ట సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) గతంలో జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ రెండు వ్యాజ్యాలను దిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది. వీటి విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

దరఖాస్తుదారుల్లో ఒకరు ఈడీ నియామక ప్రక్రియ నిబంధనలకు సంబంధించిన వివరాలు కోరగా, మరొకరు ఈడీ న్యాయ సలహాదారు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాచారం కోరారు. మొదటి సందర్భంలో ధర్మాసనం సీఐసీ ఉత్తర్వును తోసిపుచ్చింది. రెండో కేసులో సెక్షన్‌ 24 వర్తించదని స్పష్టం చేసింది. దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని ఎనిమిది వారాల్లోపు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభ ఎం. సింగ్‌ ఆదేశించారు.