Center approves establishment of industrial parks in Telugu states
Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందుకోసం రూ. 25 వేల కోట్లు ప్యాకేజీ కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసింది. తద్వారా ఆ యా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక ఈ కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అందులోభాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని నరేంద్ర మోదీతోపాటు వివిధ శాఖల మంత్రులను సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలుమార్లు కలిసి విజ్ఞప్తిలు చేసిన సంగతి తెలిసిందే.
అదీకాక కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు.. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలబడతామంటూ ఆ వేళ.. మోదీ, షా ద్వయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App