ACB surprise raids at CCS ACP’s house..Arrest
Trinethram News : గుట్టలుగా నోట్ల కట్టలు, వెలకట్టలేని గోల్డ్ సీజ్!
అక్రమాస్తులు కలిగిఉన్నాడని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావ్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటిపై ఏసీబీ జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో కలిపి మొత్తం 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.
ఈ సోదాల్లో దాదాపు రూ.3.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో వీటి విలువ మరింత ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ఉమామహేశ్వరావు బాధితుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారని, నిందితులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మరి కొన్ని కేసుల్లో ఉమ మహేశ్వర రావ్ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో శామీర్ పేట్‌లో ఓ విల్లా కొనుగోలు చేశాడు. అంతేకాకుండా మరో 17 చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వాటిల్లో 5 ఘట్కేసర్, 7 వైజాగ్ చౌడవరం, అశోక్ నగర్ 1, షామీర్‌పెట్ 1, కుకట్‌పల్లి 1 చొప్పున ఉన్నాయి. ఇవికాకుండా 38 లక్షలు నగదు, 60 తులాల బంగారం సోదాల్లో పట్టుబడినట్లు ఏసీబీ జేడి సుధీంద్ర తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
సోదాల్లో సందీప్ పేరుతో డాక్యుమెంట్లు లభించినట్లు ఆయన తెలిపారు. ఆ పేరుతో చాలా మంది పోలీసులున్నారని, వారిలో ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు. సోదాల తర్వాత ఉమామహేశ్వర్‌రావును మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామన్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని తెలిపారు. అనంతరం ఉమామహేశ్వరరావును అతడి నివాసం నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
కాగా 1995 బ్యాచ్‌కు చెందిన ఉమామహేశ్వర్‌రావు తొలినాళ్ల నుంచీ అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాడు. ఆబిడ్స్, జవహర్‌నగర్ ఠాణాల్లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో కూడా సస్పెండయ్యాడు. 2022 లో ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు జరుగగా, కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అక్కడి ఏసీపీని సస్పెండ్ చేసి, ఆ స్థానంలో ఉమామహేశ్వర్‌రావును నియమించగా.. బాధ్యతలు చేపట్టిన తర్వాత భూసెటిల్‌మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఆయనను సీసీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడ సాహితీ ఇన్‌ఫ్రా కేసు దర్యాప్తు బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇబ్రహీంపట్నంలో బాధితులు కొందరు ఉమామహేశ్వర్‌రావుపై ఆరోపణలు చేశారు. ఇక సైబరాబాద్ పరిధి మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉమామహేశ్వర్‌రావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఆయన ఇంటితో పాటు అదే అపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు బంధువుల ఇళ్లు, సీసీఎస్‌లోని ఆయన ఆఫీస్ ఛాంబర్, ఎల్బీనగర్, వైజాగ్, నర్సిపట్నం తదితర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ బృందాలుగా ఏకకాలంలో సోదాలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App