33 నేరాల్లో జైలుశిక్ష పెంపు
83 నేరాల్లో జరిమానా హెచ్చింపు
హత్యానేరం సెక్షన్ ఇక 101
దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్
మూక హింసకు మరణ దండన
నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు
సత్వర న్యాయానికి సమయ నిర్దేశం
3 నేర బిల్లులకు ఆమోదం
దిల్లీ: బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్).. పేరుతో ఈ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. గురు, శుక్రవారాల్లో ఏదో ఒక రోజున వాటిని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్కడా ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకమైతే అవి చట్టాలుగా మారతాయి.
పాత కొత్త బిల్లుల్లో..
పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు.
పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా.. కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు.
కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.
న్యాయ సంహిత బిల్లు
కొత్తగా 20 నేరాల చేర్పు.
ఐపీసీలోని 19 నిబంధనల తొలగింపు.
33 నేరాల్లో జైలు శిక్ష పెంపు.
83 నేరాల్లో జరిమానా పెంపు.
23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.
కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.
పిల్లలకు నిర్వచనం.
జెండర్‌లో ట్రాన్స్‌జెండర్ల చేర్పు.
దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన.
చరాస్తికి విస్తృత నిర్వచనం.
మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.
నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.
వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం.
ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు.
భిక్షాటన మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణన.
రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు.
పిచ్చివాడు, అవివేకి, ఇడియట్ వంటి పురాతన పదాలు తొమ్మిది చోట్ల తొలగింపు.
బ్రిటీష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటీష్ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాల తొలగింపు.
44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్టు అని వాడుక.
పిల్లలు అనే పదానికి బిల్లు మొత్తంలో ఏకీకృత నిర్వచనం.
12 చోట్ల డీనోట్స్ స్థానంలో మీన్స్ వాడుక. దటీజ్ టూ సే స్థానంలో నేమ్‌లీ వాడుక.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత
మేజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంపు.
నేరాంగీకార పరిధి విస్తరణ.
గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10ఏళ్లు అంతకంటే అధిక శిక్షల కేసులన్నింటికీ వర్తింపు. కొత్త బిల్లులో అత్యాచారం కేసు చేర్పు.
మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.
మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి.
అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదు.
జప్తు, స్వాధీనం వంటి చర్యలకు విధివిధానాలు.
తీర్పు వచ్చేవరకూ స్వయంగా హాజరుకాకపోయినా విచారణకు అవకాశం.
దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్‌ఐఆర్ నమోదు.
మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి.
దర్యాప్తులో ఫోరెన్సిక్ సాయానికి అనుమతి.
తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు.
బెయిలుకు అర్థం సరళీకరణ.
మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం.
నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ.
తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు.
నాలుగో వంతుగానీ, ఆరోవంతుగానీ విధింపు.
కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో, వీడియో రికార్డుల పరిగణన.
సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో,వీడియో రికార్డులకు అవకాశం.
ప్రజా ప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం.
శోధన, సీజ్ చేయడాన్ని వీడియో తీసే అవకాశం.
క్షమా భిక్ష పిటిషన్‌ను విధివిధానాలు.
సాక్షుల రక్షణకు ప్రత్యేక పథకం.
బాధితుల రక్షణ సంబంధిత నిబంధనల చేర్పు. బాధితులకు విస్తృత నిర్వచనం. దర్యాప్తు వివరాలను బాధితులకు ఎప్పటికప్పుడు అందించడం.
రెండు కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా నిబంధనల రూపకల్పన.
తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ.
ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ మరింత సమర్థంగా పనిచేసేలా చర్యలు.
ఘోరమైన నేరాల్లో చేతులకు బేడీలు వేసే నిబంధన చేర్పు.
కోర్టులో హాజరుకావడానికి ఇచ్చే నోటీసు ప్రొఫార్మా తయారీ. ప్రభుత్వాధికారుల సాక్ష్యాలు ఆడియో, వీడియో రూపంలో సేకరణ.
35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ చేర్పు.
35 నేరాల్లో సత్వర న్యాయానికి సమయ నిర్దేశం.
భారతీయ సాక్ష్య అధినియం బిల్లు
కొత్త బిల్లులో రెండు కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్ల జోడింపు.
5 వివరణల జోడింపు. 4 వివరణల తొలగింపు.
2 నిబంధనల జోడింపు. 24 నిబంధనల తొలగింపు.
మొత్తంగా 6 సెక్షన్ల తొలగింపు.
దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డుల జోడింపు.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి.
సాక్ష్యానికి నిర్వచనం.
ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ.
సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లిఖితపూర్వకంగా సేకరణ.
న్యాయపరంగా ఆమోదించేలా, విలువ ఉండేలా, ఎన్‌ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల నిర్వహణ.
భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ.
వలసపాలక పదబంధాల తొలగింపు.
భాష ఆధునికీకరణ. లింగ సున్నితత్వానికి గౌరవం.
సమగ్ర మార్పులు: అమిత్ షా
నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చామని, రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని వివరించారు. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. బిల్లులకు ఆమోదం సందర్భంగా లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు. తొలిసారిగా బిల్లులకు మానవ హంగులు అద్దామని, గతంలో ఉన్న హర్ మెజెస్టీ, బ్రిటిష్ కింగ్‌డం, ద క్రౌన్, బారిష్టర్, రూలర్ వంటి పదాలు ఇక ఉండబోవని ఆయన తెలిపారు. ‘ఈ కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. వలసవాద మనస్తత్వం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయి. బాధితులకు న్యాయం చేసేవిగా ఉంటాయి’ అని పేర్కొన్నారు. సామూహిక (మూక) హింసాకాండకు పాల్పడితే మరణ దండన విధించే సెక్షన్ కొత్త బిల్లులో ఉందని అమిత్ షా తెలిపారు.