Trinethram News : హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్‌పై మరో కేసులో ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట ఠాణా పరిధిలోని అప్పటి సీఏం క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుప్రమాదం కేసులో పరారీలో ఉన్న అతడిపై ఇప్పటికే లుకవుట్ సర్క్యులర్ జారీ అయిన సంగతి తెలిసిందే. మరో రోడ్డుప్రమాద ఘటనలో అతడి ప్రమేయముందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నం.45 ప్రాంతంలో 2022 మార్చి 17న జరిగిన రోడ్డుప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతిచెందిన ఘటనకు సంబంధించిన కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఆరోజు దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన థార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులనుఢీకొట్టింది. కాజల్, సారిక, సుష్మ గాయపడగా కాజల్ చేతిలోని రెండునెలల బాలుడు దుర్మరణంపాలయ్యాడు. కారులోని ఉన్న ముగ్గురు పారిపోయారు. ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. బోధన్ ఎమ్మెల్యే వాహనంగా తేలింది ఆ కారులో తన తనయుడు రాహిల్ లేడని షకీల్ తెలిపారు. దర్యాప్తు ముమ్మరం కావడంతో ఆఫ్రాన్ తానే కారు నడిపానంటూ లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోలాయని పోలీసులు ప్రకటించారు.
బాధితురాళ్ల వాంగ్మూలాల సేకరణ
ఆ కారులో మాజ్ అనే మరో యువకుడితోపాటు రాహిల్ ఉన్నట్లు అప్పటి దర్యాప్తులో తేలడంతో కేసు మలుపు తిరిగింది. సీసీ ఫుటేజ్‌తోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ విషయం గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. ఇటీవలే రాహిల్ తన కారుతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డుప్రమాదం చేసిన నేపథ్యంలో పాతకేసుపై పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ దృష్టి సారించారు. కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. అప్పట్లో కేసులో 304-బి సెక్షన్‌ను చేర్చకపోవడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడంలాంటి కారణాల గురించి ఆరా తీస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లి బాధితురాళ్లను నగరానికి తీసుకొచ్చి వారితోపాటు మరికొందరి వాంగ్మూలాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్సీట్ నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాళ్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. రాహిల్‌ను కేసునుంచి తప్పించే ప్రయత్నంలో ఒకరిద్దరు ఉన్నతాధికారుల ప్రమేయముందని ప్రస్తుత దర్యాప్తు బృందం అనుమానిస్తుండటం కీలకంగా మారింది.