TRINETHRAM NEWS
  • తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
    • తెలంగాణలో నాణ్యమైన విద్యా వ్యాప్తికి ప్రభుత్వ కృషి
    • టీచర్ ట్రైనింగ్ శిక్షణా సంస్థ పటిష్ట పరుస్తాం
    • ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్శిటీలో రౌండ్ టేబుల్ సమావేశం
    హైదరాబాద్, మార్చి 07, 2024: తెలంగాణా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ అంశంపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మంత్రి వర్గ సహచరులు, అధికారులు చాలా చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణా విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో “తెలంగాణాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇంటర్నిషిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్ధుల అభివృద్ధి” అనే అంశంపై గురువారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయoలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అటు విద్యలో మరో వైపు ఐటీలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, దీన్ని మరింత అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో అభ్యసించే ఏ విద్యార్ధి కూడా నైపుణ్యం లేకుండా ఉపాధి అవకాశాలు కోల్పోరాదని ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్ధులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్నిషిప్ పొందేలా చర్యలు చేపట్టాలని తద్వారా విద్యార్ధికి పరిశ్రమలతో అనుసంధానం ఏర్పడి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన రీతిలో విధ్యార్ధులను తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ లో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఉన్నాయని ఆయా బహుళజాతీ సంస్థలు, ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వంతో అవగాహణ ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతం నుంచి మరింత మంది ఉపాధి పొందడానికి ఇది దోహద పదనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా ఉన్నత విద్యా మండలి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూనే అటు ప్రభుత్వంతో ఇటు పారిశ్రామిక సంస్థలతో కో ఆర్డినేషన్ కోసం ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి సమక్షంలో ఉన్నత విద్యా మండలి – బి.ఎఫ్.ఎస్.ఐ. మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. అనంతరం ఉన్నత విద్యా మండలి రూపొందించిన తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధి గణాంకాల నివేదికను, డైరీ ని మంత్రి ఆవిష్కరించారు.
    కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం IAS, మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అభ్యసించే విద్యార్ధులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివ్రుద్ధికి ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని దీనికి అన్ని విద్యా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యను, ఇతర డిగ్రీ కోర్సులను అభ్యసించే విధ్యార్ధులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేష్ తదితరులు ప్రసంగించారు. ఈ రౌండ్ టేబుల్ సదస్సులో పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ప్రొ. రవీందర్, ప్రొ.గోపాల్ రెడ్డి, పలు పరిశ్రమల అధినేతలు బి.వి. మోహన్ రెడ్డి, శేకర్ రెడ్డి, శ్రీని రాజు, మమత, ఫిక్కి నుంచి రాజీవ్ జూలకంటి, రిటైల్ మేనేజ్మెంట్ ప్రతినిధి సమీర్ నర్సాపూర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.