TRINETHRAM NEWS

హైదరాబాద్‌: అవుటర్‌ అవతలికి పరిశ్రమల తరలింపు ప్రక్రియ కొలిక్కి వచ్చేలా లేదు. దశాబ్దం క్రితం రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలను తరలించాలని సంకల్పించినా నిర్వాహకులు అంగీకరించలేదు.  తరలింపు వల్ల 50 శాతం వరకు నష్టాలు వస్తాయని, వాటిని భరించేదెలా అని ప్రశ్నిస్తున్నారు. నగరంలోలాగే అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్ల క్రితం 1700 లకుపైగా రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమల తరలింపునకు కార్యాచరణ సిద్ధం చేశారు. 2016 వరకు 1545 ఫార్మా, రసాయన ఉత్పత్తుల పరిశ్రమలను గుర్తించిన అధికారులు.. వాటిలో 385 పరిశ్రమలను మాత్రమే తరలించారు. ఐదేళ్లలో అనుమతులు లేకుండానే అనేక కాలుష్య కారక పరిశ్రమలు కాటేదాన్‌, నాచారం, జీడిమెట్ల ప్రాంతాల్లో నెలకొల్పారు.

10 వేల ఎకరాలు అవసరం..

గ్రేటర్‌ పరిధిలో 7 వేల ఎకరాల్లో పరిశ్రమలున్నాయి. జనావాసాల మధ్య ఉన్న వాటిని తరలించాల్సి వస్తే 10 వేల ఎకరాలు అవసరమని అప్పట్లో నిర్ణయించారు. కాలుష్యాన్ని వెదజల్లే వంటనూనెల పరిశ్రమల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలో 200 ఎకరాలు.. ఐరన్‌ ఓర్‌, స్టీల్‌ పరిశ్రమల కోసం వికారాబాద్‌ జిల్లా రాకంచర్లలో టీఎస్‌ఐఐసీ భూములు కేటాయించింది. కానీ  ఫ్యాక్టరీల నిర్వాహకులు మౌలిక వసతులు లేవని ఆసక్తి చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 250 కిపైగా బల్క్‌డ్రగ్‌ యూనిట్లు ఉండగా.. వాటిలో సగానికంటే ఎక్కువ ఓఆర్‌ఆర్‌ లోపలే ఉన్నాయి. పర్యావరణ అనుమతులు తీసుకొని ముచ్చెర్ల వద్ద ఫార్మాసిటీకి వీటిని తరలించాలని భావించారు. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఔషధ నగరిని రద్దు చేయడంతో తరలింపు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.

పీసీబీకి లెక్కలేనన్ని ఫిర్యాదులు..

కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించకుండా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారబోస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై పీసీబీకి లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు 83 పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. మరో 132 పరిశ్రమలపై వచ్చిన ఫిర్యాదులపై టాస్క్‌ఫోర్స్‌ బృందం విచారించి కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌, కన్‌సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ నిబంధనల ప్రకారం నియంత్రణ చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేస్తూ గడువు విధించింది.