TRINETHRAM NEWS

మరి కాసెపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళాయే..ఎమ్మెల్యే అనహర్హత పై స్పీకర్ నిర్ణయం…?బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎప్పుడంటే.?
ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌…ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్‌. సభలో యుద్ధానికి టీడీపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. చర్చకు తాము సిద్ధం అంటోంది అధికార వైసీపీ.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిపై గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత సభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే సమావేశాలను మూడు రోజుల పాటు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అవసరం అనుకుంటే మరో ఒకట్రెండు రోజులు సమావేశాలు పొడిగించే అవకాశం ఉంటుంది. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. మూడో రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల కోసం బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. సుమారు 60 వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న చివరి సమావేశాలు ఇవే కావడం విశేషం.

మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, ఎమ్మెల్యేలు అంతా సభకు హాజరయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశం లేదు. ఇక సభలో చర్చించాల్సిన అంశాలపై టీడీఎల్పీ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. 10 అంశాలపై సభలో చర్చకు పట్టుపట్టాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు వైసీపీ మాత్రం తమ ఐదేళ్ల సంక్షేమ పాలనపై చర్చిస్తామని అంటోంది. సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.