నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
Aditya Varma

నిబంధనలు పాటించకపోతే నామినేషన్ చెల్లదు: ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ

Aditya Varma : అరకులోయ నవంబర్ 17, (త్రినేత్రం న్యూస్): పెసా చట్టం కింద గ్రామసభల ద్వారా ఎన్నికై, ప్రభుత్వ గుర్తింపు పొందిన కమిటీ సభ్యులు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకుంటే ముందుగా తమ పెసా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని గ్రామసభల ద్వారా ఎన్నికై పెసా కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు తమ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నుంచి ఆమోదం పొందాలని తెలిపారు. సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కనీసం ఒక రోజు ముందుగానే రాజీనామా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
రాజీనామా ఆమోద పత్రాన్ని పొందిన అనంతరం, సంబంధిత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్క్రూటినీ ప్రక్రియకు ముందే సమర్పించి ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తుగా పెసా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసి, సంబంధిత అధికారుల ఆమోదం పొందని పక్షంలో సదరు అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కావని ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ స్పష్టం చేశారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పెసా కమిటీ సభ్యులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page