
–బలవంతపు వసూళ్లతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న అధికారులు.
- కే. బాబురామ్ నాయక్, రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ & జాతీయ అధ్యక్షులు.
Retirement Celebrations : దేవరకొండ డివిజన్/ నేరేడు గొమ్ము అక్టోబర్ 29, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే, తమ స్వార్థం కోసం నిబంధనలను గాలికి వదిలి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సొసైటీ ఫౌండర్ & జాతీయ అధ్యక్షులు కే. బాబురామ్ నాయక్ తీవ్రంగా ఖండించారు. నేరేడుగొమ్ము మండల విద్యాశాఖ అధికారి తాటికొండ బ్రహ్మచారి ఉద్యోగ విరమణ వేడుకల పేరుతో జరుగుతున్న అరాచకాలు, బలవంతపు వసూళ్ల పర్వంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పాఠశాల వేళల్లో చదువు చెప్పాల్సిన బడులను వేడుకల అడ్డాలుగా మార్చడం అత్యంత దుర్మార్గమని స్పష్టం చేశారు.
ఒకవైపు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, నేరేడుగొమ్ము మండలంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి తాటికొండ బ్రహ్మచారి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తూల శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యా ప్రణాళికను, విద్యా హక్కు చట్టం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల పనివేళల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను కూడా తరగతులకు దూరం చేసి ఇలాంటి సన్మాన సభలు నిర్వహించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. బోధనా సమయాన్ని పూర్తిగా విద్యార్థుల చదువుకోసం కేటాయించాల్సింది పోయి, బడి వేళల్లో అందరినీ ఉత్సవాలకు తరలించడం ద్వారా విద్యార్థుల ప్రాథమిక హక్కులను మరియు భవిష్యత్తును కాలరాయడమే అవుతుంది. విద్యను అందించాల్సిన దేవాలయాలు లాంటి బడులను వ్యక్తిగత సన్మానాలకు వేదికలుగా మలచడం విద్యా వ్యవస్థకే తీరని కళంకం.
ఇది కేవలం సన్మాన వేడుక మాత్రమే కాకుండా, కిందిస్థాయి ఉపాధ్యాయులపై జరుగుతున్న తీవ్రమైన ఆర్థిక దోపిడీ అని ఆయన విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతూ.. ప్రాథమిక పాఠశాలల నుండి వెయ్యి రూపాయలు (ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ఈ బలవంతపు వసూళ్ల డబ్బులు జమ చేయడం గమనించదగిన విషయం), ప్రాథమికోన్నత పాఠశాలల నుండి పదిహేను వందల రూపాయలు, ఉన్నత పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలల నుండి రెండు వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా, మోడల్ పాఠశాల నుండి బియ్యం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నుండి చికెన్ రూపంలో వసూళ్లు చేయడం చూస్తుంటే ఇక్కడ చట్టాలు నడుస్తున్నాయా లేక అధికారుల దౌర్జన్యాలు నడుస్తున్నాయా అనే తీవ్రమైన సందేహం కలుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ విధంగా వేధింపులకు గురిచేసి వసూళ్లు చేయడం సేవా నిబంధనల ప్రకారం నేరం మరియు అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది.
సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మండల విద్యాశాఖ అధికారి తాటికొండ బ్రహ్మచారి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తూల శ్రీనివాసులు ఇటువంటి అక్రమాలకు పాల్పడటాన్ని మా సొసైటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి పద్ధతులు ఏమాత్రం మంచివి కావు, వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి అధికారులను ఉపేక్షించడం వల్ల భవిష్యత్తు తరాల విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్తాయి.
కాబట్టి, ప్రభుత్వం మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. పాఠశాల పనివేళల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో నిబంధనలకు విరుద్ధంగా సన్మాన సభలు నిర్వహించి, ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఖాతాలో డబ్బులు జమ చేయిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడిన మండల విద్యాశాఖ అధికారి తాటికొండ బ్రహ్మచారి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తూల శ్రీనివాసులులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ బలవంతపు వసూళ్లు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు మరియు సరుకుల సేకరణపై జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అందరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ తంతును మరియు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న తీరును మార్చుకోకపోతే, బాధితులైన ఉపాధ్యాయులను కలుసుకొని, మా సొసైటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుత మరియు చట్టపరమైన ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe