
— రూ.5,400 ధాన్యం/బియ్యాన్ని రూ.9,000 పైచిలుకు అమ్ముతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న సిండికేట్లు
– రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
- బాబురామ్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్.టి.ఐ.ఎస్.ఎస్).
Mafia Runs : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 27, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంతో ప్రారంభమై, నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆకలిని వ్యాపార వస్తువుగా మలుచుకుంటూ కొందరు అసాంఘిక శక్తులు, వ్యాపార వర్గాలు సాగిస్తున్న దోపిడీ అన్ని హద్దులను దాటింది. కష్టపడి చెమటోడ్చి పని చేసే సామాన్యుల సంపాదనంతా కేవలం బియ్యం కొనుగోలు చేయడానికే సరిపోతున్న దయనీయ పరిస్థితులు నల్లగొండలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ నెలకొన్నాయనీ అన్నారు. అసలు క్వింటాల్ బియ్యం ధర రూ. 5,400 లోపు ఉంటే, దానిని మిల్లర్లు, కిరాణా షాపుల యజమానులు కుమ్మక్కై సిండికేట్‌గా మారి ఏకంగా రూ. 9,000 నుండి రూ. 9,500 పైచిలుకు అమ్ముతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.
ఈ దారుణ పరిస్థితిపై రాష్ట్రవ్యాప్త క్షేత్రస్థాయి విశ్లేషణ క్రింది విధంగా ఉంది:
అన్నదాతలు తమ కష్టంతో పండించిన ధాన్యాన్ని మార్కెట్లోకి తెచ్చే సమయం నుంచే ఈ దోపిడీ పర్వం మొదలవుతుంది. రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం సేకరించే కొందరు అక్రమ రైస్ మిల్లర్లు, ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి మార్కెట్లోకి వదులుతారు. ఇక్కడే అసలు కుట్ర మొదలవుతుంది. రైతుల శ్రమను చౌకగా కొని, కృత్రిమ కొరతను సృష్టించి, అసలు మార్కెట్ విలువకు మరియు అమ్మే ధరకు పొంతన లేకుండా వ్యాపారులు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు. కేవలం నల్లగొండలోనే కాక తెలంగాణ వ్యాప్తంగా కొద్దిమంది పెద్ద మిల్లర్లు, హోల్‌సేల్ గోదాముల యజమానులు మరియు స్థానిక కిరాణా షాపుల నిర్వాహకులు ఒక శక్తివంతమైన ‘సిండికేట్’ గా ఏర్పడి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు.
బహిరంగ మార్కెట్లో క్వింటాల్ సన్న బియ్యం అసలు ధర రూ. 5,400 ఉండగా, ఈ సిండికేట్ కావాలనే రేట్లను అమాంతం పెంచేసింది. కిరాణా షాపుల్లో కేజీ సన్న బియ్యం ధరను రూ. 95 పైచిలుకు విక్రయిస్తూ, సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ వస్తువునైనా గరిష్ట రిటైల్ ధర (ఎం.ఆర్.పి) ప్రకారమే అమ్మాలి. ఎక్కువ తక్కువలకు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ సిండికేట్ ఆ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయడం లేదు.
ఈ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా నిత్య కూలీలు, చిన్న ఉద్యోగులు, దినసరి కార్మికులు ఉండే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిత్యం కూలీ నాలి చేసుకునే నిరుపేద కుటుంబాలలో జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఒక పూట గడవాలంటేనే కేజీల కొద్దీ బియ్యం అవసరమవుతాయి. కిలో రూ. 95 పెట్టి కొనుగోలు చేయలేక నిరుపేద కుటుంబాలు పూటగడవక అల్లాడిపోతున్నాయి. ఇక ఇళ్లల్లో చిన్న చిన్న ఫంక్షన్లు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు జరిగే సమయంలో కనీసం 100 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతాయి. క్వింటాల్‌కు రూ. 9,000 పైచిలుకు అంటే, కేవలం బియ్యం కోసమే అదనంగా రూ. 10,000 కు పైగా భారం పడుతోంది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.
ఈ విచ్చలవిడి దోపిడీని నివారించడంలో సంబంధిత పౌరసరఫరాల శాఖ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ దందాలపై అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, చట్టపరమైన పర్యవేక్షణను కఠినతరం చేయాలి. ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలకు తావుఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై తక్షణమే చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని, లేనియెడల యంత్రాంగంపై ప్రజల నమ్మకం సడలే ప్రమాదం ఉందని స్పష్టం చేసారు.
నల్లగొండ జిల్లా కలెక్టరుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా .
తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లులు, హోల్‌సేల్ గోదాములు, కిరాణా షాపులపై ప్రత్యేక అధికారులతో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి సన్నబియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలని అధికారులను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe