
జూలై 10లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ నిషాంతి.టి
Voter Registration : అల్లూరి సీతారామరాజు జిల్లా, జూలై 7,(త్రినేత్రం న్యూస్): జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిషాంతి.టి అధికారులను ఆదేశించారు. జూన్ 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, జూలై 10లోగా 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం మిగిలిన రోజుల్లో వివరాల పరిశీలన, సవరణలపై దృష్టి సారించాలని సూచించారు.
సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నియమించబడిన 624 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల వివరాల సేకరణ, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,99,752 మంది ఓటర్లకు సంబంధించిన ఎలక్టోరల్ స్పెసిఫిక్ ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్‌లు) ముద్రణ, పంపిణీ దాదాపు వంద శాతం పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు.
డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరం… జిల్లావ్యాప్తంగా ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 2,29,689 ఫారాలు నమోదు కావడంతో 45.96 శాతం ప్రగతి నమోదైందని తెలిపారు.
అరకు వ్యాలీలో 48.01 శాతం పూర్తి… అరకు వ్యాలీ నియోజకవర్గ పరిధిలోని ముంచింగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు వ్యాలీ, అనంతగిరి మండలాల్లో మొత్తం 2,48,665 మంది ఓటర్లకు ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. డిజిటలైజేషన్ 48.01 శాతం పూర్తికాగా, ముంచింగిపుట్టు మండలం 52.16 శాతంతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది.
పాడేరు నియోజకవర్గంలో 43.93 శాతం ప్రగతి… జి.కె.వీధి, కొయ్యూరు, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మండలాల పరిధిలోని 2,51,087 మంది ఓటర్లకు గాను 2,51,083 ఫారాల పంపిణీ పూర్తయింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 43.93 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
జూలై 10లోగా డిజిటలైజేషన్‌ను పూర్తిస్థాయిలో పూర్తి చేసి, అనంతరం తప్పుల సవరణలు చేపట్టాలని కలెక్టర్ నిషాంతి.టి ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక అధికారులు, ఏఆర్‌ఓలు, బీఎల్‌ఓలు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe