TRINETHRAM NEWS

పేదల కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చారు

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

4వ డివిజన్లో పర్యటన
Trinethram News : రాజమహేంద్రవరం : ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైకాపా ప్రభుత్వం ఆమాదిరిగానే కుప్పకూలిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 4వ డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం సాయంత్రం స్థానిక టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. రాజేంద్రనగర్లో ప్రస్తుతం ఉన్న 3, 4 డివిజన్లకు సంబంధించిన సచివాలయాలను అదే ప్రాంతంలో పలుచోట్ల ఉన్న నగర పాలక సంస్థ చెందిన భవనాల్లోకి మార్చేందుకు జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న మూడు నాలుగు డివిజన్లకు సంబంధించి నిర్వహిస్తున్న సచివాలయాలను ఆయా భవనాల్లోకి మార్పు చేసి ఆ భవనాన్ని కమ్యూనిటీ హాలుగా తీర్చిదిద్ది పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాలను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. అటువంటి కమ్యూనిటీ హాళ్లను వైకాపా అధికారంలో ఉన్న సమయంలో సచివాలయాలుగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల నివాస ప్రాంతాల్లో నాడు తెలుగుదేశం ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లు నిర్మించడం జరిగిందని, అధిక ఖర్చుతో బలహీన వర్గాలు వారి శుభకార్యాలు చేసుకోలేని స్థితిలో ఉన్నందున వారికోసం ఈ నిర్మించడం జరిగిందని అన్నారు. పేద ప్రజలు వారి శుభకార్యాలు ఎలా చేసుకుంటారనే కనీస జ్ఞానం లేకుండా కమ్యూనిటీ హాళ్లు అన్నింటిని సచివాలయాలుగా మార్చేశారని మండిపడ్డారు. త్వరలోనే అన్ని కమ్యూనిటీ హాళ్లను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధే ధ్యేయంగా తాము నిత్యం పని చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం కూడా అందుకు కంకణం కట్టుకుందన్నారు. వైకాపా వారు విధ్వంశాలు చేస్తే తాము నిర్మాణాలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా అక్కడి నగర పాలక సంస్థ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపి శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, తాడేపల్లి గూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీను, నాయకులు జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీను, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSRCP's destruction our construction