TRINETHRAM NEWS

శివుడి ఆజ్ఞతోనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే‌భాగ్యం లభించింది

మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Trinethram News : రాజమహేంద్రవరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ, రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మహా శివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెల్ల వారు జామునే పవిత్ర గోదావరి పుణ్య స్నానమాచరించారు. అనంతరం నగరంలోని గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయస్వామి ఆలయం, కోటగుమ్మం, చింతాలమ్మ ఘాట్, కోలింగాల పేట కోటిలింగేశ్వర స్వామి, సారంగధర మెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమ శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన సేవా కార్యక్రమాలకు హాజరయ్యారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలకు ఆయన హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుల్లో ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తన వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది శివరాత్రికి స్నానాలరేవుల్లో సదుపాయాలు బాగా చేశారని చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎందుకంటే కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించి అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. అయితే అంచనాలకు మించి పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారని అన్నారు. ప్రయోగరాజ్ కుంభమేళాకు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తే సుమారు 60 కోట్లమంది వచ్చారని, రానున్న గోదావరి పుష్కరాలకు 10 కోట్లమంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని కాని 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కుంభమేళా అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.ఇక శివరాత్రి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని గుర్తు చేశారు.

ప్రభుత్వ పరంగా భక్తులకు ఏర్పాట్లు చేసినప్పటికీ రాజమండ్రి ప్రజలు దానగుణం కలిగిన వారని భక్తులకు పులిహోర, మజ్జిగ అల్పాహారం ఇలా వివిధ రకాలుగా ప్రసాద వితరణ చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారని సంతోషం వ్యక్తంచేశారు. గత పుష్కరాలకు కూడా ఇలాగే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు యాత్రికులకు సేవలు అందించారని కొనియాడారు. ప్రభుత్వం తరుపున ఏర్పాట్లు చేసినప్పటికీ స్వచ్చంద సేవాసంస్థలు, ప్రజలు రాజమండ్రిలో సేవా కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Adireddy Srinivas