TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల, 2024 మార్చి 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకుని ఏప్రిల్ 9వ‌ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.