సినీ ప్రముఖులు జయప్రద ‘పరారీ’లో ఉన్నట్టు ప్రకటించిన స్పెషల్ కోర్టు*
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు
ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు
కోర్టుకు హాజరుకాని జయప్రద
మార్చి 6లోగా జయప్రదను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఎస్పీకి కోర్టు ఆదేశాలు
నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు.
ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పరారీలో ఉన్న జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మార్చి 6 లోపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు.
జయప్రద గతంలో రాజ్యసభ ఎంపీగానూ, లోక్ సభ ఎంపీగానూ ఉన్నారు. అయితే రాంపూర్ నియోజకవర్గంలో అజమ్ ఖాన్ తో వివాదాల నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ నుంచి వైదొలగి 2019లో బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.