ఎమ్మెల్యేలను మరో పార్టీకి వెళ్ళనీయకుండా…!
వైసిపి అధినేత జగన్ పక్కా రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను మార్చి సంచలనం రేపారు. అత్యంత నమ్మకస్తులను సైతం మార్చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతనే సైడ్ చేశారు. తనతో జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకటరమణకు సైతం హ్యాండ్ ఇచ్చారు.
మంత్రి విడదల రజిని లాంటి మహిళా నేతకే స్థానచలనం కల్పించారు. సమీప బంధువు బాలినేనికే చుక్కలు చూపిస్తున్నారు. ఇవన్నీ పక్కా వ్యూహంతో చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతలపై ఒత్తిడి పెంచేందుకేనని ప్రచారం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా తన పార్టీలోనే కాకుండా.. ఎదుట పార్టీలో స్థానం లేకుండా సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లి ప్యాలెస్ లో కార్పొరేట్ ఇంటర్వ్యూల తరహాలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ జరుగుతుంది. ముందుగా ఎంపీ మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. అనంతరం సీఎం జగన్ వద్దకు వారిని చేర్చుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ లను ఎంత తిడితే అంత మైలేజ్ వస్తుందని.. అటువంటి వారికే అధినేత ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి, వారిని తిట్టడానికి వంతన ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నమవుతోంది. ఇలా కలుస్తున్న వారు వారి వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మీకు తిట్టాలని చెప్పారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకటే సమాధానం వస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు.
తాను తప్పించడమే కాకుండా.. టిడిపి, జనసేనలోకి వెళ్లడానికి వీలు లేకుండా చేసేందుకే.. వారితో చంద్రబాబు, పవన్ లపై తిట్టిస్తున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ తరహాలో కుట్రలు చేస్తే కానీ.. వైసీపీ సిట్టింగులు తమ దరికి రారని.. వేరే పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ తిట్ల పురమాయింపని తెలుస్తోంది. వైసీపీ నేతలకు బూతుల పోటీలు పెట్టడం వెనుక సజ్జల మార్కు కుట్ర ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
టిక్కెట్లు ఇవ్వకపోయినా వారు జనసేన, టిడిపిలోకి వెళ్లకుండా… ఇప్పించే ప్రక్రియకు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. పేర్ని నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, అమర్నాథ్ సహా ఎంతో మంది నేతలకు టికెట్ ఇవ్వకపోయినా వేరే పార్టీలో చేరలేరు. ఎందుకంటే వారు విపక్ష నేతలను ఉద్దేశించి ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఫార్ములాను మిగతా నేతల విషయంలో అమలు చేస్తున్నారు.
ఏడాది కిందట చాలామంది వైసిపి నాయకులు దూకుడుగా ఉండేవారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేవారు. కానీ వారి మాటలో ఇటీవల వాడి తగ్గింది. అనుచిత వ్యాఖ్యల జోలికి పోవడం లేదు. ఎన్నికల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో? ఎవరు అధికారంలోకి వస్తారో? అధికారం తారుమారయితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నను చాలామంది వైసిపి నాయకులు తమను తాము సంధించుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు అయినా కాస్తంత సంయమనం పాటిస్తే బెటరని భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు చేయగలం కానీ.. వ్యక్తిగత కామెంట్లకు మాత్రం దూరమని తేల్చి చెబుతున్నారు.