Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, కన్వీనర్ ప్రొఫెసర్ భానుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.జేఎన్‌టీయూ అనంతరపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్చి 15 నుంచి ఈసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తాం. ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. రూ.500లు ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 వేలు ఆలస్య రుసుంతో ఏప్రిల్ 29 వరకూ, అలాగే రూ.5 వేలు ఆలస్య రుసుంతో మే 2 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మే 8వ తేదీ కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
పరీక్ష అనంతరం మే 10వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేస్తామన్నారు. ఆన్సర్ కీపై మే 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్ కీని విడుదల చేస్తామన్నారు. అనంతరం ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 100 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, బయో టెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు అధికారవ వెబ్‌సైట్ సందర్శించాలని విద్యార్ధులకు సూచించారు.