TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియలను బోర్డు పూర్తి చేసింది. మూల్యాంకన ప్రక్రియను మరోమారు పునఃపరిశీలన చేసేందుకు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఒకటికి రెండు సార్లు తరవుగా చెక్‌ చేసి ఈ నెల 15వ తేదీ నాటికి ఇంటర్‌ ఫలితాలు వెలువరించేందుకు ఇంటర్ బోర్డ్‌ సన్నాహాలు చేస్తోంది.

కాగా ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,52,673 మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే. రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి మొత్తం 10 లక్షలకుపైగా మంది పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్‌ మొదటి ఏడాది 5,17,617 మంది, ఇంటర్‌ రెండో ఏడాది 5,35,056 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరిలో మొత్తం 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగిన ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 75 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌కు యత్నించగా.. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరోవైపు తెలంగాణలోనూ ఇంటర్‌ ఫలితాలను ఏప్రిల్‌ నాలుగో వారంలో లేదంటే మే మొదటి వారంలో ప్రకటించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 స్పాట్‌ వాల్యుయేసన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 60 లక్షల పేపర్లను 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు. మూల్యాంకనం ముగిసిన తర్వాత పలు రకాలుగా పరీక్షించిన తర్వాతే ఆ మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ రెండో వారం నాటికి స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తి చేసే అవకావం ఉంది.