TRINETHRAM NEWS

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి పొన్నంతో ప్రయాణికుల మొర

బస్సులు పెంచి, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని హామీ

హైదరాబాద్‌, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు

కండక్టర్‌ సైతం ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు. మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ఆదివారం హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ బయలుదేరారు. మధ్యలో ఆర్టీసీ బస్సెక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పలు సమస్యలు విన్నవించారు. ఉచిత బస్సు ప్రయాణంతో బస్సు ల్లో రద్దీ ఎక్కువైందని తెలిపారు. కిక్కిరిస్తున్న బస్సుల్లో ప్రయాణించడం ఇబ్బందిగా ఉందని చెప్పారు. స్పందించిన మంత్రి త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని, ఎవరికీ ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. కండక్టర్‌ సైతం పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేసే విషయ మై ప్రభుత్వం చర్చిస్తున్నదని పొన్నం తెలిపారు. సంస్థలో అవసరమైన ఉద్యోగ నియామకాలు సైతం చేపడుతున్నామని చెప్పారు

నేడు ఆటోడ్రైవర్లతో పొన్నం చర్చలు

ఆటో కార్మిక సంఘాల నాయకులతో సోమవారం సాయంత్రం మంత్రి పొన్నం సమావేశం కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయామని ఆటోడ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెల్సిందే