Trinethram News : ఆదిలాబాద్ జిల్లా:
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు..
ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
కాగా నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా… ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవతల బౌలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు బేటింగ్ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్తో పాటు మెస్రం పెద్దలు పాల్గొన్నారు..