The District Collector held a meeting with representatives of brick kilns, hotels and other commercial businesses in the district on the occasion of the World Day Against Child Labour.
పెద్దపల్లి, జూన్ -12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార రంగాలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, హోటల్స్, ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను పనిలో చేర్చుకోవడానికి వీలులేదని, బాలకార్మిక నిరోధ చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.
మన జిల్లాలో ఉన్న అన్ని ఇటుక బట్టిలను తనిఖీ చేసి వలస కార్మికుల పిల్లలకు సంబంధించి ఏజ్ గ్రూప్ వారీగా ఆడిట్ నిర్వహించి రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వలస కార్మికుల పిల్లలను వెంటనే సమీపంలో గల అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా జాయిన్ చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వలస కార్మికుల పిల్లల పూర్తి బాధ్యత సదరు యాజమాన్యాలు తీసుకోవాలని, మన రాష్ట్రంలో ఉన్నంతవరకు వారికి పౌష్టికాహారం అందించడం, మంచి విద్య అందించడం మన బాధ్యతని, దీనిని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పని ప్రదేశంలో వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మిక చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, వేధింపులు జరగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న సిఐ కృష్ణ మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య యజమానులు తమ దగ్గర పని చేసే కార్మికులకు కనీస మౌళిక వసతులు కల్పించాలని అన్నారు. వలస కార్మికులు తీసుకుంటున్న ఆహారంపై శ్రద్ధవహించాలని, రాబోయే సీజన్లో పౌష్టికాహారం లేక వీరోచనాలు, వాంతులతో వలస కార్మికులు అనారోగ్యం పాలు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మన దగ్గర పనిచేసే కార్మికుల యోగక్షేమాలు మన బాధ్యతగా పరిగణించాలని, కార్మికుల చట్టం ప్రకారం వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించాలని, పని ప్రదేశంలో కనీస వసతులు ఉండాలని, వారికి ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే చికిత్స చేసేందుకు పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్ ఏర్పాటు చేయాలని అన్నారు.
కార్మికుల రవాణా సమయంలో సైతం నిబంధనలు పాటించాలని, పని ప్రదేశాలలో మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో విధులలో చేర్చుకోవద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, డిసిపిఓ కమలాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్, సంబంధిత అధికారులు, ఇటుక బట్టీలు, హోటల్, కిరాణ, క్లాత్ స్టోర్స్ యూనియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App