TRINETHRAM NEWS

సంగారెడ్డి : సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో సీఎస్‌ఆర్‌ నిధుల సేకరణపై పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు సేకరించాలన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఈ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వసతి గృహాలు, ఆసుపత్రులు, అదనపు తరగతుల భవనాల పనులకు వెచ్చించాలని సూచించారు. ఇప్పటి వరకు పరిశ్రమల నుంచి సేకరించిన నిధులు, ఇంకా రావాల్సినవి.. తదితర వివరాలపై మంత్రి ఆరా తీశారు. పరిశ్రమ సమీపంలోని ప్రాంతాల అభివృద్ధికి వినియోగించేలా క్లస్టర్‌ ఇన్‌ఛార్జి అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంజీరాపై వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు

జోగిపేట: జోగిపేటకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యమని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శనివారం జోగిపేట పట్టణంలోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. అందోలు-నర్సాపూర్‌ నియోజకవర్గాల మధ్య మంజీరా నదిపై అజ్జమరి వద్ద నూతన వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరయ్యాన్నారు. ఈ పనులు పూర్తయితే 20 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇక్కట్లు తీరడమే కాకుండా.. రైతులకు అధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. అందోలులో 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్‌ కళాశాల నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆర్య వైశ్య సంఘం భవన అసంపూర్తి పనుల పూర్తి కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం అందోలు చెరువును పరిశీలించి బోటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రంగ సురేష్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు గోలి పద్మ, కౌన్సిలర్లు చిట్టిబాబు, డాకూరి, శంకర్‌, సురేందర్‌గౌడ్‌, చందర్‌, రేఖా పాల్గొన్నారు….