హైదరాబాద్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కమ్ముకుపోయాయి. మధ్యాహ్నం దాకా కాస్త ఎండగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి వాతావరణం కనిపిస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉదయం పూట ఎండ..రాత్రిపూట చల్లటి గాలులు వీస్తున్నాయి.
చల్లటి వాతావరణానికి చిన్నపిల్లలు, వృద్దులు బయటకు రావాలంటే వణుకుతున్నారు. గుండె జబ్బులున్న వాళ్లు చలికి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు,వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరో వైపు రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో చలి గాలులు వీస్తున్నాయి.