సంగారెడ్డి : పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇదే ఉద్దేశంతో రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ బాధ్యతను డీలర్లకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా బినామీ రేషన్ డీలర్లతో కొనసాగుతున్న దుకాణాల కారణంగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అలాంటి వారి ఏరివేతకు నిర్ణయించింది.
ఒకరికి బదులు మరొకరు
రేషన్ దుకాణం బోర్డుపై ఒకరి పేరు ఉంటే నడిపేది మరొకరు.. డీలర్ మృతి చెందితే కుటుంబీకులు కాకుండా ఇతరులు కూడా చలామణి అవుతున్నారు. దీనివల్ల పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇక నుంచి ఇలాంటి బినామీలు లేకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి అదేశాలు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించారు.
పక్కాగా పరిశీలిస్తేనే
రేషన్ డీలర్లుగా అధికారికంగా పేరు ఉన్న వారిలో కొందరు ఇతర పనులు చేస్తున్నారు. తమ పేరిట ఉన్న దుకాణాన్ని ఇతరులకు అప్పగించి నెలకు ఎంతో కొంత అందజేస్తున్నారు. అధికారుల తనిఖీల సమయంలో అసలైన డీలర్లు వచ్చి రేషన్ దుకాణంలో కూర్చునే అవకాశం ఉంది. తనిఖీకి వెళ్లిన అధికారులు రేషన్ కార్డు లబ్ధిదారులతో రహస్యంగా విచారిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
మార్గదర్శకాల ప్రకారం గుర్తిస్తాం
రేషన్ దుకాణాల తనిఖీ ప్రక్రియ ఉన్నతాధికారుల మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తాం. ఇప్పటికే ఆర్డీవోలకు మార్గదర్శకాలను పంపాం. ఆర్డీవోల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బినామీ డీలర్లను గుర్తించి నివేదిక అందిస్తారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.