TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ సమాజాన్ని నైతికంగా, ఆర్థికంగా పతనం చేస్తున్న మద్యం బెల్టుషాపులు తక్షణం తొలగించాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మద్యనిషేధం సాధ్యం కాకపోయినా బెల్టుషాపులు తొలగించడం, లైసెన్సు షాపుల అమ్మకం సమయాలు క్రమబద్ధీకరణ చేయడం ద్వారా కనీసం మద్య నియంత్రణ చేసే అవకాశం ఉంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలలో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కో గ్రామానికి అరడజను నుంచి డజను దాకా అధికారిక మద్యం షాపులు నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి, రెండు మినహాయిస్తే ప్రతి కిరాణా షాపు, బడ్డీ కొట్టు మద్యం అమ్మకం రిటైల్ దుకాణాలుగా మారిపోయాయి. ఫలితంగా కూలీ-నాలీ చేసుకునేవారు, ముఖ్యంగా 18 సంవత్స రాలలోపు పిల్లలు, కొందరు మహిళలు కూడా మద్యం మహమ్మారికి బానిసలుగా మారిపోతున్నారు. పేదకుటుంబాలు ఈ వ్యసనంతో ఛిద్రం అవుతున్నాయి.

మద్యానికి బానిసలైన వారు అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరగడం ద్వారా ఆర్థికంగా కోలుకోలేక కుటుంబాలు పతనం అవుతున్నాయి. అనేక అనైతిక సంఘటనలకు ఈ మద్యం మహమ్మారి కారణం అవుతున్నది. పట్టుమని 30ఏళ్ళు నిండకుండానే మద్యానికి బానిసలయిన యువత మరణిస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే కొందరు యువతులు ఒంటరి మహిళలుగా మారటంతో అర్ధంతరంగా కుటుంబభారం వారి నెత్తిన పడుతున్నది. తెలంగాణలో ఒంటరి మహిళల పెన్షన్ల పెరుగుదల గణాంకాలను పరిశీలిస్తే మద్యం మహమ్మారి ఎంత దారుణంగా కుటుంబాలను ఛిద్రం చేస్తుందో అర్థం అవుతుంది. అనేక పేదకుటుంబాలు ఈ మద్యం మూలంగా సరైన ఆహారం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాయి.

2014లో తెలంగాణలో ఆరువేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే! 2024నాటికి అది 36వేల కోట్లకు పెరిగింది. గడచిన పదేళ్ళలో ఆరు రెట్లు మద్యం అమ్మకాలు పెరగడంతో పాటు అదే స్థాయిలో మద్యం మరణాలు, వివిధ జబ్బులు పెరిగాయి. బెల్టుషాపుల ద్వారా మద్యం అందుబాటులో ఉండడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. మద్యం షాపులు పెంచుతున్న పాలకులు, మద్యం మానడం కోసం కౌన్సిలింగ్ సెంటర్లు, మద్యం డీ-ఎడిక్ట్ కేంద్రాలు పెంచకపోవడం విస్మయం కలిగిస్తోంది.

ఇకపోతే మద్యానికి బానిసలయిన యువత మద్యం మత్తుచాలక గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఈ డ్రగ్స్ మహమ్మారి పబ్‌లను దాటి అత్యంత గౌరవప్రదమైన కళాశాలలు, పాఠశాలల ముంగిటకు వచ్చేశాయి. సిగరెట్లలో, చాక్లెట్లలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ నింపి అమ్మకాలు చేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తు తరం కూడా తెలంగాణలో మత్తుబానిసలుగా మారి, సమాజంలో విలువలు పతనం వైపు ప్రయాణం చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిషేధిత గుట్కా (పొగాకు ఉత్పత్తులు) యధేచ్ఛగా అమ్మకం జరుగుతున్నాయి. ఇవన్నీ గత పాలకులకు తెలియక కాదు? ఆయా వ్యాపారాలు తమ నాయకుల కనుసన్నల్లో జరగడమే ప్రధాన కారణం. నిరోధించాల్సిన అధికారగణం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడమే కాక, ఆ మత్తుపదార్థాల అవినీతి రొంపిలో పీకల్లోతు కూరుకుపోయింది. మద్యం నియంత్రణకు ఏర్పడిన ఎక్సైజ్ శాఖ పనితీరు అందుకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు మరింత విస్తృతపరిచే శాఖగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల నిరోధం కోసం చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. అయితే 36వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాల రాబడిని ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం వదులుకుంటుందా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. అయినా ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా తక్షణం పట్టణాలు, గ్రామాలలోని బెల్టుషాపులు మూయించాలి. మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి లాగా తమ తమ నియోజకవర్గాల్లో బెల్టుషాపులు నిరోధించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. ప్రజలు కూడా బెల్టుషాపులు మూయించడంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి.