TRINETHRAM NEWS

ఎస్సీ నియోజకవర్గంలో దళిత అధికారికి అవమానం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్, వికారాబాద్ జిల్లా, ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం అయినా వికారాబాద్ లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుండి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయాన్ని శనివారం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏర్పాటుచేసిన శిలాఫలకంపై విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ సంజీవ పేరును ముద్రించలేదు. దీంతో అతను దళిత వర్గానికి చెందిన అధికారి కాబట్టి, ఉన్నతాధికారులు కావాలనే ఆయన పేరును తొలగించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై సదరు అధికారి కూడా మీడియా ముఖంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

శిలాఫలకాల ముద్రణకు ముందు జాబితాలో కంప్యూటర్ డిజైనింగ్ లోనూ ఆయన పేరు ఉన్నప్పటికీ, శిలాఫలకం పై మాత్రం ఎందుకు వేయలేదని పలువురు దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని విమర్శిస్తున్నారు. దీంతోపాటు ఆ శాఖలో దళితులపై గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వివక్షకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఉన్నటువంటి అంబేద్కర్ చిత్రపటాన్ని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువచ్చి వారం రోజుల క్రితమే తీసివేయించారని విశ్వసనీయ సమాచారం.

ఈ పూర్వ రంగంలోనే డివిజనల్ ఇంజనీరు సంజీవ పేరును తొలగించారని చర్చినీయాంశం అయింది. దీనిపై వికారాబాద్ జిల్లాలోని వివిధ సంఘాల నాయకులతో పాటు, విద్యుత్ శాఖలోని దళిత ఉద్యోగులు, ఇతర శాఖలోని దళిత ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూపరింటెండింగ్ ఇంజనీరు వెంటనే డివిజనల్ ఇంజనీర్ సంజీవకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ చిత్రపటాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. శనివారం డివిజనల్ ఇంజనీర్ కు జరిగిన అవమానంపై శాసనసభాపతి ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు విద్యుత్ శాఖలోని దళిత ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు ఆ శిలాఫలకాన్ని తొలగించి డీఈ పేరును జత చేసి తిరిగి ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shame on Dalit officer