SSC Delhi Police Results 2023: ఎస్సెస్సీ కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల..
ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) నియామక పరీక్షలకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింకుల ద్వారా ఎంపికైన వారి వివరాలు తెలుసుకోవచ్చు. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి దశ పరీక్షలకు ఎంపికయినట్లు ఎస్సెస్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ని దశల్లో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
తెలంగాణ ఉపకార దరఖాస్తు గడువు జనవరి 31 పెంపు
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు తేదీలోగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు.
కాగా 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ గతేడాది (2023) ఆగస్టు 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. అయితే గతేడాది కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ కోర్సుల ప్రవేశాలు ఆలస్యమవడంతో కొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈపాస్ గణాంకాల ప్రకారం రెన్యువల్ విద్యార్థులు మొత్తం 8,04,304 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించినట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. వారిలో 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.