TRINETHRAM NEWS

Sarkar’s decision to widen the Kondamodu road – the road between Amaravati and Hyderabad is paved

Trinethram News : పల్నాడు జిల్లా… పేరేచర్ల- కొండమోడు రోడ్డు గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలోని కీలక రహదారి.

దీన్ని విస్తరించాలనేది ఉమ్మడి గుంటూరు జిల్లా వాసుల దశాబ్దాల కల.

అయితే సంవత్సరాలుగా ఈ కల సాకారం కాకపోవడంతో గోతులమయమైన ఇరుకు రోడ్డులో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

ప్రధానంగా సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు ఉన్న 27 కిలోమీటర్ల మార్గం అత్యంత దారుణంగా మారి నిత్యం అనేక ప్రమాదాలతో పదుల సంఖ్యలో వాహనదారులు చనిపోతున్నారు.

గతంలో ఓ అడుగు ముందుకు పడి ఆగిన ఈ రోడ్డు విస్తరణకి మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మోక్షం కలిగింది.

గుంటూరు జిల్లా, పేరేచర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమోడు వరకు 50 కిలోమీటర్ల దూరం. గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాద్‌ వైపు వెళ్లే వారికి ఇది ప్రధాన మార్గం. ఈ మార్గంలో పేరేచర్ల నుంచి సత్తెనపల్లి వరకు రహదారి కొంత బాగానే ఉన్నా సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు ఉన్న 27 కిలోమీటర్లు మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది. అడుగడుగునా గుంతలతోపాటు బెర్మ్‌లు లేవు, పైగా రహదారి పూర్తిగా ఇరుకుగా ఉంటుంది.

ఎదురుగా నాలుగు చక్రాల వాహనం వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా వస్తున్న మరో వాహనం పక్కకు దిగి ఎదుటి వాహనానికి దారి ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం ఇక అంతే సంగతి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. అదే సమయంలో ప్రయాణానికీ అదనపు సమయం పడుతోంది.

ఏళ్లుగా ఈ రహదారిని విస్తరించాలని ప్రయాణికులు అనేక సార్లు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అయినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడంతో మరోసారి ఈ మార్గం విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. కేంద్రం జాతీయ రహదారి 167 ఏజీగా గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది.

భారత్‌ మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులతోపాటు పేరేచర్ల- కొండమోడు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది. నాలుగు వరుసలుగా విస్తరణకు 1,032 కోట్లతో టెండర్లు పిలిచి, గుత్తేదారు ఎంపికై ఎల్​ఓఏ ఇచ్చే దశకు పనులు చేరుకున్నాయి. అయితే జాతీయ రహదారుల బడ్జెట్‌కు మించి పనులు మంజూరవడంతో గత సంవత్సరం నవంబరు నుంచి వీటిని కేంద్రం తాత్కాలికంగా నిలిపేసింది. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆగిపోయిన పేరేచర్ల- కొండమోడు రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డు, పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు? ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు.

నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్‌ 1.5 మీటర్లు, రెండువైపులా మార్జిన్‌లు కలిపి 22.5మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మించాల్సి ఉంది. పేరేచర్ల- కొండమోడు నాలుగు వరుసల ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుంది. మరోవైపు సీఆర్‌డీఏ నిర్మించే బాహ్యవలయ రహదారికి కూడా సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి ఈ రహదారి కీలకంగా మారనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sarkar's decision to widen the Kondamodu road - the road between Amaravati and Hyderabad is paved