TRINETHRAM NEWS

టికెట్‌ రాదనే ప్రచారంపై ఘాటుగా రియాక్ట్ . నగరి నుంచి పోటీ చేసి తీరుతానన్న రోజా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్‌కే రోజా ఘాటు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా తనకు టికెట్‌ రాదనే ప్రచారంపై రోజా భగ్గుమన్నారు. నగరి నుంచి పోటీ చేస్తానో.. చేయనో అనేది తమ పార్టీ అధిష్టానానికి చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారుతెలుసునని అన్నారు. తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు. మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు.

శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం బాగు ఉండాలి. జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని ప్రార్థించాననని తెలిపిన రోజా.. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక పక్క పార్టీ లోని వారి కోసం ఎదురు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అంతకు రెట్టింపు అభిమానం ఎమ్మెల్యేలలో ఉందన్నారు రోజా. జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వెంట ఉన్నామని, జగన్ సీఎం కావాలని పనిచేసే వాళ్ళమన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అని సర్వేలు తేలుస్తాయన్నారు రోజా. టికెట్ రానివారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు రోజా.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు ఒకచోట నిలుచునే దమ్ము లేదన్న రోజా.. రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల పోటీ చేయాలని సర్వేలు చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టే 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు రోజా. నగరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదన్నారు. నేను జగనన్న సైనికురాలినని, జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తానన్నారు రోజా. పార్టీ కార్యకర్తలు, నాయకులకు తెలుసు నగిరి టికెట్ తనకేనని, అందుకే వాళ్లలో ఎలాంటి భాధ లేదన్నారు మంత్రి ఆర్కే రోజా.

ఇదిలావుంటే, నగరి నియోజకవర్గంలో వైసీపీ మహిళా నేతల మధ్య విభేదాలు సద్దుమణగడం లేదు. మంత్రి రోజా, ఈడిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ KJ శాంతికి పొసగడం లేదు. గతంలో నగరి పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ ఇద్దరు కలిసి పనిచేయాలని హితవు చెప్పారు. ఇద్దరి చేతులు సీఎం జగన్‌ స్వయంగా కలిపారు. సీఎం చెప్పినా ఇద్దరి వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.